నల్గొండ జిల్లా దామరచర్ల మండలం యాదాద్రి పవర్ ప్లాంట్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడారు. 2025 మే నాటికి యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్ట్ పూర్తి చేసి 4వేల మెగావాట్ల విద్యుత్త్ గ్రిడ్‌కు అనుసంధానం చేస్తామని ఉపముఖ్యమంత్రి అన్నారు. పవర్ ప్లాంట్ స్టేషన్ లోని స్టేజి-1 లో విద్యుత్ ఉత్పత్తిని ఆదివారం (నవంబర్ 3) గ్రిడ్ ను అనుసంధానం చేశారు. శాసన సభలో చర్చించి రాష్ట్రంలో న్యూ ఎనర్జీ పాలసీని త్వరలోనే తీసుకుమని భట్టీ విక్రమార్క అన్నారు.
న్యూ ఎనర్జీ పాలసీని తీసుకురావడంలో మేధావులు విద్యుత్ రంగంలో నిష్ణాతులతో చర్చించి వారి అభిప్రాయాలు తీసుకుంటామని తెలిపారు. సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం గడ్డిపల్లి గ్రామంలో 25 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ శంకుస్థాపలో ఉపముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మంత్రులు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరైయ్యారు.
రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ డిమాండ్ ను దృష్టిలో పెట్టుకొని 2028- 29 నాటికి 22వేల 288 మెగావాట్ల అవసరం ఉంటుందని అంచనా వేశామని డిప్యూటీ సీఎం తెలిపారు. 2034 -35 నాటికి 31వేల 809 విద్యుత్ డిమాండ్ ను అంచనా వేసి.. ఉత్పత్తి చేయడానికి ప్రజా ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలు తీసుకొని ముందుకు పోతుందని స్పష్టం చేశారు. భవిష్యత్తులో కరెంట్ కోతలు ఉండకూదని పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. రాష్ట్రంలో పరిశ్రమ, వ్యవసాయం, గృహ అవసరాలకు క్వాలిటీ పవర్ ను అందిస్తున్నని భట్టి విక్రమార్క చెప్పుకొచ్చారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా వాతావరణం కలుషితం కాకుండా 20 వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు.