స్కూల్స్‌‌‌‌లో స్పోర్ట్స్‌‌‌‌ క్లాస్​ తప్పనిసరి : భట్టి విక్రమార్క

స్కూల్స్‌‌‌‌లో స్పోర్ట్స్‌‌‌‌ క్లాస్​ తప్పనిసరి : భట్టి విక్రమార్క

బషీర్ బాగ్, వెలుగు: ప్రతి ఒక్కరూ క్రీడలను తమ జీవితంలో భాగస్వామ్యం చేసుకోవాలని అప్పుడే అందరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. విద్యార్థులు క్రీడలలో రాణించేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని, అందులో భాగంగానే ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్ లో తప్పనిసరిగా స్పోర్ట్స్ పీరియడ్ ను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో బంగారు పతకాలు సాధించి రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావడానికి కృషి చేయాలని, అందులో భాగంగానే స్పోర్ట్స్ యూనివర్శిటీని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ ఉద్యోగులకు క్రీడా పోటీలను నిర్వహించారు. రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ శివసేనారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ క్రీడా పోటీలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. 

ఈ సందర్భంగా భట్టి మాట్లాడారు. హైదరాబాద్ సిటీలో ప్రసిద్ధ క్రీడా పోటీలు నిర్వహించేందుకు అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయని, దీనిపై ఇటీవల కేంద్ర మంత్రిని కలిసి విజ్ఞప్తి చేశామని పేర్కొన్నారు. క్రీడల అభివృద్ధికి ఎటువంటి నిధుల కొరత లేదని, అవసరమైన నిధులను విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని వివరించారు. రాష్ట్రంలోని క్రీడా సముదాయాల భవనాలకు మరమ్మతులు చేసి అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఆరోగ్యంగా ఉండటానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయని వెల్లడించారు. మూడ్రోజుల పాటు ఈ క్రీడలు కొనసాగుతాయని, ఈ నెల 29న ముగుస్తాయని స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి అన్నారు.