భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: ఇంటింటికి నల్లా నీరు పేరుతో రూ.42 వేల కోట్ల ప్రజాధనాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. రూ.42 వేల కోట్లు ఖర్చుపెట్టి ఇంటింటికీ నల్లా నీళ్లు ఇచ్చామని కేంద్రానికి సర్టిఫికెట్ కూడా పంపిందని ఆయన తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం, కొత్తగూడెం మున్సిపాలిటీల్లో రూ.130 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు గురువారం మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి భట్టి శంకుస్థాపన చేశారు. అనంతరం కొత్తగూడెం పట్టణంలో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడారు.
రూ.42 వేలు ఖర్చుచేస్తే కొత్తగూడెం పట్టణంలో రూ.124 కోట్లతో నీటి ఎద్దడి నివారణ పనులకు తాము ఎందుకు శంకుస్థాపన చేస్తామో చెప్పాలన్నారు. భువనగిరి నియోజకవర్గం ఆలేరులో నీటి ఎద్దడి నివారణకు రూ.150 కోట్లు కావాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అడుగుతున్నారన్నారు. రాష్ట్రంలోని అనేక గ్రామాల్లో మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదన్నారు. మిషన్ భగీరథ పేరుతో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోని పెద్దలు రూ.వేల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం సృష్టించిందన్నారు. ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తూనే రాష్ట్రంలో సంక్షేమ పథకాలను తమ ప్రభుత్వం అమలు చేస్తోందని భట్టి పేర్కొన్నారు.