
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 30 వేల ఎకరాలకు సాగు నీరాందించాలని గూడెం ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేస్తే.. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక నాసిరకం ప్రాజెక్టులతో రైతులకు కష్టాలు తప్పడం లేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. 3 టీఎంసీల నీళ్లను రెండు మోటార్ల ద్వారా ఇవ్వాల్సి ఉండగా.. మోటార్ల రిపేర్లు, పైపులు పగిలి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. 13 మంది రైతుల ప్రాణానికి ముప్పు ఉన్న నేపధ్యంలో వారికి భరోసా కల్పించి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింప జేశానని తెలిపారు. గూడెం లిఫ్ట్ నుండి సాగునీరు అందించాలని మూడు రోజులుగా రైతులు ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్నారు. ఈ క్రమంలో దీక్ష చేస్తున్న రైతులకు, కాంగ్రెస్ నేతలకు భట్టి విక్రమార్క నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన...సాగు నీటికోసం రైతులు పోరాటం చేస్తుంటే.. బీఅర్ఎస్ పార్టీ నేతలు ఒక్కరు కూడా పట్టించుకోలేదన్నారు. రైతులకు అండగా ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని తెలిపారు. కెనాల్ 30, 42 కాలువ ద్వారా 30 వేల ఎకరాలకు సాగు నిరందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వం, రైతులకు అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.