బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అబద్ధాలను అతిపెద్ద స్థాయిలో చెబుతున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ‘‘బండి సంజయ్ చేస్తున్నది పాదయాత్ర కాదు.. విష యాత్ర’’ అని ఆయన వ్యాఖ్యానించారు. విషప్రచారం చేస్తూ రాష్ట్రంలో మతకల్లోలాలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు వల్ల సామాన్యులపై ధరల భారం పడుతోందన్నారు. ధరలు నియంత్రణలోకి రావాలంటే బీజేపీకి తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
నల్గొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలోని పీఆర్ఆర్ ఫంక్షన్ హాల్ లో జరిగిన కాంగ్రెస్ పార్టీ బూత్ ఇంచార్జిలు, గ్రామ శాఖ అధ్యక్షులు, మండల సమన్వయ కర్తల సమావేశంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడారు. టీఆర్ఎస్ పార్టీ రుణమాఫీ చేస్తామని చెప్పి చేయలేదన్నారు. పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు కట్టించలేదని ఆయన చెప్పారు. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే గతంలో మాదిరిగా రైతులు ఆత్మ గౌరవం తో బతుకుతారు.. రుణమాఫీ జరుగుతుందని తెలిపారు. దేశ సంపద అంతా అదానీ, అంబానీలకు పోవద్దంటే ప్రజలు కాంగ్రెస్ ను ఆదరించాల్సిన అవసరం ఉందన్నారు.