Gaddar Awards: దశాబ్ద కాలంగా చిత్ర పరిశ్రమ ఎలాంటి ప్రోత్సాహకాలను నోచుకోలే: డిప్యూటీ సీఎం భట్టి

Gaddar Awards: దశాబ్ద కాలంగా చిత్ర పరిశ్రమ ఎలాంటి ప్రోత్సాహకాలను నోచుకోలే:  డిప్యూటీ సీఎం భట్టి

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 'గద్దర్‌‌ తెలంగాణ ఫిల్మ్ అవార్డులు' జూన్‌ 14న ప్రదానం చేయనున్నారు. నేడు (ఏప్రిల్ 22న) ఈ అంశంపై తెలంగాణ ప్రభుత్వం సమీక్షా సమావేశం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఫిల్మ్ డెవలప్​మెంట్ కార్పొరేషన్ (FDC) చైర్మన్ దిల్ రాజు, సీనియర్ నటి జయసుధ హాజరయ్యారు.

ఈ సందర్భంగా  తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారి ఏర్పాటు చేసుకున్న అవార్డులని.. దశాబ్ద కాలంగా పరిశ్రమ ఎలాంటి ప్రోత్సాహకాలకు, అవార్డులకు నోచుకోలేదన్నారు. 

దశాబ్దకాలంగా నిర్లక్ష్యంగా చేయడం మంచి సంప్రదాయం కాదని సీఎం భావించినట్లు తెలిపారు. మొదటి నుంచి కూడా సమాజంలో అంతర్భాగం అయినటువంటి కళలలను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. అది ఎప్పటికీ కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులు ప్రవేశపెట్టడానికి చాలా కారణాలున్నాయని..తెలంగాణ గుండె చప్పుడును తన పాటల ద్వారా విశ్వవ్యాప్తం చేసిన గొప్ప వ్యక్తి గద్దర్‌. ఒక శతాబ్దానికి గద్దర్ లాంటి వ్యక్తి పుడతారు. తెలంగాణ రాష్ట్రంలో గద్దర్ పుట్టడం మన అదృష్టం. తన పాటతో తెలంగాణ ఆవిర్భావానికి ప్రాణం పోశారు. అటువంటి వ్యక్తి పేరు మీద అవార్డులు ప్రదానం చేయడం మనకెంతో గర్వకారణం అని భట్టి తెలిపారు.