మార్పు, మహోన్నత ఆకాంక్ష కోసమే పీపుల్స్ మార్చ్ పాదయాత్ర చేపట్టానని అన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. మే 25వ తేదీ మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. రాహుల్ గాంధీపై తప్పుడు కేసు పెట్టి ఇల్లు ఖాళీ చేపిస్తే.. కర్ణాటక ప్రజలు బీజేపీని ఆ రాష్ట్రం నుంచి ఖాళీ చేయించారని ఎద్దేవా చేశారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన పోడు భూముల పట్టాలను ధరణి పోర్టల్ లో పొందుపర్చడం లేదని ఆదిలాబాద్ అడవి బిడ్డలు ఆందోళన చెందుతున్నారని వ్యాఖ్యానించారు. సింగరేణి ఆస్తులను కాపాడాలని బొగ్గు బావి కార్మికులను కోరారు. తల్లిదండ్రులు అప్పులు చేసి తమ బిడ్డలను కోచింగ్ సెంటర్లకు పంపి చదివిస్తే..ఈ ప్రభుత్వం పేపర్ లీక్ చేసి పరీక్షలను రద్దు చేసిందని మండిపడ్డారు.
రాష్ట్రంలో 24 లక్షల ఎకరాల పేదల భూములను సర్కారు అమ్ముకుంటోందని భట్టి విక్రమార్క ఆరోపించారు. పేదలకు ఇచ్చిన 5 లక్షల కోట్ల విలువైన ఇళ్ల పట్టాల సంపదనను రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, బడా కంపెనీలకు ప్రభుత్వం కట్టబెట్టాలని చూస్తోందన్నారు. నాలుగైదు నెలల్లో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది.. కాంగ్రెస్ పంచిన భూముల్లో అరకలు కట్టిస్తాం..ధరణి పోర్టల్ ను బంగాళాఖాతంలో వేస్తామని తెలిపారు .
కుర్చేసుకుని కూసోని కట్టిస్తామన్న పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును కేసీఆర్ మరిచారన్నారు. పాలమూరు జిల్లాలో కట్టిన ప్రాజెక్టులన్నీ కాంగ్రెస్ హయాంలోనివే అని చెప్పారు. అంతేకాదు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ను కట్టేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే అని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు.