- రంగారెడ్డి జిల్లా చందన్వెల్లిలో సోలార్ పవర్ ప్లాంట్ ప్రారంభం
చేవెళ్ల, వెలుగు : రాష్ట్ర ప్రజల భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ప్రత్యామ్నాయ విద్యుత్ ఉత్పత్తిపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం షాబాద్ మండలం చందన్‌వెల్లిలోని జున్నా సోలార్ పవర్ ఉత్పత్తి ప్లాంట్‌ను ఆయన ప్రారంభించారు. స్ట్రింగర్ మెషీన్ యూనిట్ ను ప్రారంభించిన అనంతరం సోలార్ పవర్ ఉత్పత్తి విధానం గురించి అక్కడున్న ఇంజనీర్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
2030 నాటికి ప్రజల డిమాండ్ కు అనుగుణంగా ప్రత్యామ్నాయ విద్యుత్తును ఉత్పత్తి చేస్తామన్నారు. సౌర శక్తి, పవన శక్తి, హైడల్, చెత్త నుంచి తయారు విద్యుత్తు ఉత్పత్తిని పెంచుతూ ప్రజల అవసరాలు తీర్చుతామని చెప్పారు. విద్యుత్తు రంగంపై గత ప్రభుత్వం 81 వేల కోట్ల రూపాయలకు పైగా అప్పుల భారం మోపిందన్నారు. ఈ భారాన్ని అధిగమించి ప్రజల అవసరాలకు అనుగుణంగా ఇప్పుడున్న థర్మల్ విద్యుత్తుకు ప్రత్యామ్నాయ మార్గాలతో అధిక విద్యుత్తు ఉత్పత్తిని పెంచుతామన్నారు. పరిశ్రమ ఎండీ జున్న శేఖర్‌రెడ్డి మాట్లాడుతూ..100 మెగావాట్ల సోలార్ మాడ్యూల్ మ్యానుఫ్యాక్చరింగ్ లైన్‌ను ఆవిష్కరించినట్లు చెప్పారు.
భట్టిని కలిసిన చందన్వెల్లి భూబాధితులు..
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం చందనవెల్లి గ్రామంలోని సర్వే నెంబర్ 190లోని భూసేకరణలో అవకతవకలు జరిగాయని, దీనిపై సమగ్ర విచారణ చేయించాలని భూబాధితులు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎంజాయ్ మెంట్ సర్వే పేరిట భూమి లేని వారి పేర్లను భూ సేకరణలో చేర్చి నిజమైన రైతులకు పరిహారం ఇవ్వలేదని భూ బాధితులు తన దృష్టికి గతంలోనే తీసుకువచ్చారని గుర్తు చేశారు.
బాధితుల విజ్ఞప్తి మేరకు నిజమైన లబ్ధిదారులకు పరిహారం ఇప్పించేందుకు సమగ్ర విచారణ చేయిస్తానని భట్టి వారికి హామీ ఇచ్చారు. బాధితులకు స్థానికంగా ఏర్పాటు చేసిన పరిశ్రమల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. జీవితమే భూ పోరాటం అని భావించిన గద్దర్ అన్నకు నిజమైన నివాళి అర్పించడం అంటే.. భూ బాధితులకు న్యాయం చేయడమేనన్నారు.