- తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం వచ్చింది.. దొరల పాలన అంతమైంది
- అందరం సమిష్టిగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం
- రాష్ట్ర సంపద, వనరులు ప్రజలకు పంచుతాం
- సోనియాగాంధీ తెలంగాణ లక్ష్యాలు నెరవేర్చడమే మా ప్రభుత్వ బాధ్యత
- మీడియాతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
తెలంగాణలో దొరల పాలన అంతమై ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని, నేటితో ఇందిరమ్మ పాలన మొదలవుతుందని, అందరం సమిష్టిగా పనిచేసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఎల్బి స్టేడియంలో ప్రమాణ స్వీకార మహోత్సవం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ... పది సంవత్సరాల నియంతృత్వ పరిపాలన నేటితో అంతమైందని.
ప్రజలు నిరీక్షిస్తున్న ప్రజాస్వామ్య పరిపాలన ప్రారంభమవుతుందని, ప్రజల ఆశలు, ఆశయాలు, ఆకాంక్షలు, ఆత్మగౌరవం నెరవేరాలని ఎన్నికల్లో అద్భుతమైన చారిత్రాత్మకమైన తీర్పు ఇచ్చి కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ ఇచ్చారని తెలిపారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఇచ్చిన తెలంగాణ ప్రజల ఆకాంక్షల నెరవేర్చడానికి నేటి నుంచి కంకణ భద్ధులమై పని చేస్తామని చెప్పారు.
ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు పాదయాత్ర చేసిన సందర్భంగా అన్ని వర్గాల ప్రజలు తనను కలిశారని వారి సమస్యలు నేను విన్నానని ఆ సమస్యల పరిష్కారం మార్గమే కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు తెచ్చిందన్నారు. ప్రజలు పడుతున్న ప్రతి సమస్య పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ అభయహస్తం మేనిఫెస్టో తీసుకొచ్చిందని వెల్లడించారు. పీపుల్స్ ప్రభుత్వంలో ప్రజల సంపద ప్రజలకు పంచడానికి కచ్చితంగా ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని స్పష్టం చేశారు. నిరుద్యోగులకు మహిళలకు ఇల్లు లేని నిరుపేదలకు రైతులకు ఇచ్చిన హామీలను వారి ఆకాంక్షలను నెరవేర్చుతామన్నారు.
రాష్ట్ర సంపద వనరులు ప్రజలకు పంచబడాలన్నారు. ప్రభుత్వంలోని ప్రతి వ్యవస్థ ప్రజలకు మాత్రమే ఉపయోగపడాలని ఆ దిశగా తమ పరిపాలన ఉంటుందని వివరించారు. పాలకులు, అధికారులు ప్రజలకు సేవకులుగా పనిచేయాలని, ఆ లక్ష్యంతో ఇక నుంచి మా పరిపాలనకు అడుగులు ముందుకు పడతాయని వివరించారు. సమిష్టిగా నిర్ణయాలు తీసుకొని టీం వర్క్ గా పనిచేసి ప్రజల సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని వెల్లడించారు.