తుమ్మల ఇంటికి భట్టి విక్రమార్క..కీలక భేటీ

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో భేటీ అయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గండుగులపల్లి గ్రామంలోని తుమ్మల నివాసానికి చేరుకున్న భట్టి.. ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు.  ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వరరావుని కాంగ్రెస్​పార్టీలోకి ఆహ్వానించారు. 

అయితే 40 ఏండ్లుగా తనను ఇంతటి వాడిని చేసిన అనుచరులు, మద్దతుదారులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని తుమ్మల అన్నారు. సీతారామ ప్రాజెక్టును పూర్తి చేయడమే తన రాజకీయ జీవిత లక్ష్యమని తెలిపారు. ఇదిలావుండగా.. భట్టి ఆహ్వానానికి తుమ్మల నాగేశ్వరరావు ధన్యవాదాలు తెలిపారు. 

అనంతరం విక్రమార్క మాట్లాడుతూ రాష్ట్రంలో నిజాయితీగా రాజకీయాలు విలువలతో కూడిన నాయకులు కరువయ్యారని, విలువలతో కూడిన నాయుకులు తుమ్మల నాగేశ్వరరావు కొనియాడారు. అటువంటి తుమ్మలను కాంగ్రెస్ పార్టీలోకి  రావాలని కోరుతున్నట్లు తెలిపారు. భట్టి రాకతో తుమ్మల ఇంటికి కాంగ్రెస్ శ్రేణులు. నాయకులు, కార్యకర్తలు, తుమ్మల అభిమానులు భారీ సంఖ్యలో చేరుకున్నారు.

బీఆర్ఎస్ నుంచి పాలేరు టికెట్ ఆశించి భంగపడ్డ తుమ్మల పార్టీ మారుతారంటూ జోరుగా ప్రచారం నడుస్తోంది. తాజా సమాచారం ప్రకారం 2023 సెప్టెంబర్ 6 న తుమ్మల కాంగ్రెస్ లో జాయిన్ అవుతున్నట్లుగా తెలుస్తో్ంది.  రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తానని ఇప్పటికే తుమ్మల  స్పష్టం చేశారు. బీఆర్ఎస్ లిస్ట్​ ప్రకటించిన తర్వాత కూడా ఆయన అదే మాటపై ఉన్నారు. అయితే కాంగ్రెస్‌లో చేరితే ఖమ్మం నుంచి పోటీ చేయాలని ఆ పార్టీ ముఖ్య నేతలు ఆయనకు సూచించనున్నట్టు తెలుస్తున్నది. 

పాలేరు నుంచి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని బరిలోకి దింపాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పాలేరు నుంచి పోటీకి పొంగులేటి సిద్ధంగా ఉన్నా, తుమ్మల మాత్రం ఖమ్మం నుంచి పోటీకి రెడీగా లేరని అంటున్నారు. మరోవైపు వైఎస్ఆర్​టీపీ కాంగ్రెస్‌లో విలీనమైతే షర్మిల కూడా పాలేరు సీటు కోసం పట్టుబట్టే అవకాశం ఉంది.