హైదరాబాద్: ఈ ఏడాది చివర్లో జరగనున్న మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలపై కాంగ్రెస్ దృష్టి పెట్టింది. ఇటీవల జరిగిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య ఓటమితో అప్రమత్తమైన ఏఐసీసీ మహారాష్ట్ర, జార్ఖండ్‌లో మళ్లీ అలాంటి తప్పులు పునరావృతం కాకుండా ముందు జాగ్రత్త పడుతోంది. ఇందులో భాగంగానే ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందే రెండు రాష్ట్రాలకు ఎన్నికల పరిశీలకులను నియమించింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం మొత్తం 11 మంది సీనియర్ నేతలను ఎన్నికల పరిశీలకులుగా ఏఐసీసీ అపాయింట్ చేసింది. మహారాష్ట్రను 5 డివిజన్లగా విభజించి 11 మంది పరిశీలకులను నియమించిన కాంగ్రెస్ హైకమాండ్.. తెలంగాణ నుంచి మంత్రులు ఉత్తమ్, సీతక్కకు ఇందులో చోటు కల్పించింది.
నార్త్ మహారాష్ట్ర డివిజన్‌కు మంత్రి సీతక్క, మరాత్వాడకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఎన్నికల పరిశీలకులుగా నియమించింది. తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు కూడా ఏఐసీసీ కీలక బాధ్యతలు అప్పగించింది. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు పరిశీలకుడిగా డిప్యూటీ సీఎం భట్టిని ఏఐసీసీ అపాయింట్ చేసింది. భట్టితో పాటు మరో ఇద్దరు సీనియర్ నేతలు తారిఖ్ అన్వర్, అధిర్ రంజన్ చౌదరి సైతం జార్ఖండ్ ఎన్నికల పరిశీలకులుగా నియామకం అయ్యారు. ఇదిలా ఉంటే.. మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ (2024, అక్టోబర్ 15) షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది.
ALSO READ | దేశాభివృద్ధిలో తెలంగాణది కీలక పాత్ర: కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్
నవంబర్ నెలలో ఈ రెండు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నట్లు తెలుస్తోంది. కాగా, మహారాష్ట్రలో ప్రస్తుతం శివసేన (షిండే) ఎన్సీపీ (అజిత్ పవార్), బీజేపీ కూటమి పవర్లో ఉండగా.. కాంగ్రెస్, శివసేన (ఉద్ధవ్), ఎన్సీపీ (శరద్ పవార్) అలయెన్స్ అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. జార్ఖండ్‌లో ప్రస్తుతం జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ కూటమి అధికారంలో ఉంది. ఈ కూటమిని గద్దె దించి ఎలాగైనా ఈ సారి జార్ఖండ్‌లో పాగా వేయాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తోండగా.. కాషాయ పార్టీని మట్టి కరిపించి అధికారం నిలబెట్టుకోవాలని కూటమి ప్రణాళికలు రచిస్తోంది. మరీ జార్ఖండ్, మహారాష్ట్రాలో ఏ పార్టీ, కూటమి విజయం సాధిస్తోందో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.