రూ. 2 కోట్లతో బండ తొలగిస్తే .. 25 వేల ఎకరాలకు సాగునీరు: భట్టి

మక్తల్/ ​సూర్యాపేట/మధిర/వైరా, ​ వెలుగు: మక్తల్​ మండలంలోని సంగంబండ లెవెల్​కెనాల్​కు అడ్డుగాఉన్న బండ రాయిని రూ. 2 కోట్లు పెట్టి తొలగిస్తే 25 వేల ఎకరాలకు సాగునీరందుతుందని, వెంటనే ఆ పని చేస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డితో కలిసి ఆయన నారాయణపేట జిల్లా మక్తల్ ​మండలం సంగంబండ ప్రాజెక్టును సందర్శించారు. కోదాడ నియోజకవర్గంలోని రెడ్ల కుంటలో రూ. 47.64కోట్లతో చేపట్టనున్న లిఫ్ట్ స్కీమ్, రూ.5.30 కోట్లతో ఉత్తమ్ పద్మావతి లిఫ్ట్​ పునరుద్ధరణ పనులకు, మధిర టాంక్ బండ్ నుంచి నిదానపురం వరకు రూ. 10 కోట్లతో డబుల్ లైన్ రోడ్డుకు , రూ.1.20కోట్లతో మధిర నుంచి ఆత్కూరు రోడ్డు వెడల్పు పనులకు, మధిర జూనియర్​ కళాశాలలో అభివృద్ది పనులకు, సీతారామ ప్రాజెక్టుతో వైరా రిజర్వాయర్​ అనుసంధానం చేసే కాల్వ పనులకు శంకుస్థాపన చేశారు. 

70 వేల ఎకరాలకు సాగునీరందించేందుకు అప్ప టి సీఎం వైఎస్​ రాజశేఖరరెడ్డి జలయజ్ఞం కింద సంగంబండ రిజర్వాయర్ నిర్మించారని, పైన రిజర్వాయర్, కింద కాలువలు పూర్తయి దాదాపు 19 ఏండ్లయినా బీఆర్ఎస్​ ప్రభుత్వం ఒక బండ పగలగొట్టలేకపోయిందని భట్టి విక్రమార్క విమర్శించారు. బండను తొలగిస్తే మక్తల్, మాగనూర్​మండలాలకు చెందిన 15 గ్రామాల్లో 25 వేల ఎకరాలకు నీరందుతుందన్నారు. మిగిలిపోయిన సంగంబండ నిర్వాసితులకు త్వరలోనే పరిహారాన్ని వారి ఖాతాల్లో జమ చేస్తామన్నారు. పాలమూరుకు చెందిన సీఎం రేవంత్​ రెడ్డికి ఈ ప్రాంతంపై పూర్తి అవగాహన ఉందని, జూరాల నుంచి కొడంగల్, నారాయణపేటలకు కృష్ణ నీటిని ఎత్తిపోతల ద్వారా మళ్లించేందుకు ప్లాన్​ చేశారని తెలిపారు. మక్తల్, నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టుకు రూ. 3 వేల వేల కోట్లు మంజూరు చేసి.. టెండర్లు పిలిచినట్టు చెప్పారు. కాంగ్రెస్ హయాంలో చేపట్టిన లిఫ్ట్ లను బీఆర్​ఎస్​ సర్కారు పట్టించుకోకపోవడంతో సాగునీరందక రైతులు ఇబ్బంది పడ్డారని, బీడుభూములకు ప్రజాపాలనలో నీళ్లు పారిస్తామని భట్టి విక్రమార్క అన్నారు.

 నాగార్జునసాగర్ ఎడమ కాలువ పరిధిలో 3వ జోన్​లో ఉన్న మధిర ప్రాంతాన్ని రెండో జోన్ లోకి మారుస్తున్నట్లు తెలిపారు. గత పాలకులు కమీషన్లపై దృష్టి పెట్టడంతో రాష్ట్రంలో అభివృద్ధి సజావుగా సాగలేదన్నారు. ఆరు నూరైనా ఆరు గ్యారంటీలను పక్కాగా అమలు చేస్తామన్నారు. మహిళలకు వడ్డీ లేని రుణాల కోసం రూ. 1500 కోట్లు నిధులు విడుదల చేసినట్టు చెప్పారు. రాష్ట్రంలో 24 గంటలు నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలోని రైతులందరికీ రైతు భరోసా అమలు చేస్తామని, రాళ్లురప్పలకు, రోడ్లకు, భూస్వాములకు రైతు భరోసా ఇచ్చేదిలేదన్నారు. ఇప్పటివరకు మూడు ఎకరాల వరకు ఉన్న రైతులకు నగదు జమ చేశామన్నారు. ప్రస్తుతం 4 ఎకరాల రైతులకు డబ్బులు వేస్తున్నట్టు చెప్పారు. కాంగ్రెస్​ ప్రభుత్వం చెప్పిందే చేస్తోందని, ఇప్పటికే ఉచిత బస్సు, 500కే సిలిండర్​, ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్​లు ప్రారంభించామన్నారు.

సాంకేతిక లోపంతో నిలిచిపోయిన హెలికాప్టర్

మధిరలో సాంకేతిక లోపంతో హెలికాప్టర్​ నిలిచిపోయింది. దీంతో మధిర నుంచి వైరాకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమకుమార్ రెడ్డి రోడ్డు మార్గం ద్వారా వెళ్లారు. కొంతసేపటికి లోపాన్ని సరిచేసి పంపారు. 

అర్హులైన వారికి రేషన్ కార్డులు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు మంజూరు చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వం 10ఏండ్లుగా వడ్డీ లేని రుణాల పేరుతో మహిళలను మోసం చేసిందని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వడ్డీ కింద రూ.1500కోట్లు విడుదల చేసిందన్నారు. ఇండ్లు లేని పేద వారికి మహిళల పేరిట రూ.5లక్షలు ఇస్తుందన్నారు. సూర్యాపేట జిల్లాలోని లిఫ్ట్ స్కీమ్​లు పూర్తిస్థాయిలో పనిచేసేందుకు అవసరమైన పనులు చేపట్టాలని, ప్రతిపాదనలు పంపాలని సూచించారు. 

 ఇది నా జీవిత కల:  మంత్రి తుమ్మల

వైరా రిజర్వాయర్​ను గోదావరి జలాలతో అనుసంధానం చేయడం  తన కల అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. పాలేరు రిజర్వాయర్​ను లింక్​ చేయడం ఆలస్యం అవుతుందని, దీంతో వైరాప్రాజెక్ట్, లంకాసాగర్, మధిర బ్రాంచి కెనాల్​కు నీళ్లందించేందుకు రూ.100 కోట్లతో ఈ కాల్వ నిర్మాణం చేపట్టామన్నారు. నాలుగు నెలల్లో కాల్వ పనులు పూర్తి చేయాలని సీతారామ ప్రాజెక్ట్ ఎస్ఈ, ఈఈ లను ఆదేశించారు. సత్తుపల్లి నియోజకవర్గానికి రూ.75 కోట్లు మంజూరు చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరతానన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.