- పాదయాత్ర హామీల అమల్లో భాగంగా పర్యటన
- రూ.20.50 కోట్ల అభివద్ధి పనులకు శంకుస్థాపన
- ధరణి, టీఎస్‌పీఎస్సీని ప్రక్షాళన చేస్తానని నాడు ప్రకటించింది ఇక్కడే..
- నెల రోజులు సాగిన పాదయాత్రతో పిప్రితో భట్టికి ప్రత్యేక అనుంబంధం
- పర్యటనకు ఏర్పాట్లు పూర్తిచేసిన అధికారులు
బజార్‌హత్నూర్, వెలుగు : రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని మార్చిన పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు అంకురార్పణ జరిగిన ఆదిలాబాద్ జిల్లా పిప్రి గ్రామానికి తొలిసారిగా డిప్యూటీ సీఎం హోదాలో భట్టి విక్రమార్క బుధవారం రానున్నారు. పాదయాత్ర ప్రారంభం సందర్భంగా ఆనాడు ఇచ్చిన హామీల అమల్లో భాగంగా నేడు దాదాపు రూ.20.50 కోట్ల అభివద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఎస్సీ కార్పొరేషన్, ట్రైకార్, ఐటీడీఏ బ్యాంకు లింకేజీ ద్వారా మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేస్తారు. డిప్యూటి సీఎం పర్యటన సందర్భంగా కలెక్టర్ అన్ని ఏర్పాట్లు చూస్తుండగా, ఎస్పీ పోలీస్ బందోబస్తు పర్యవేక్షించనున్నారు.
చరిత్ర మొదలైంది ఇక్కడే..
సీఎల్పీ నేతగా భట్టి విక్రమార్క ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలం పిప్రి నుంచి 2023 మార్చి 16న ప్రారంభించిన పాదయాత్ర.. 16 జిల్లాలు, 37 నియోజకవర్గాలు, 700కు పైగా గ్రామాల మీదుగా సాగింది. జిల్లాలోని వాగులు, వంకలు దాటుకుంటూ.. గుట్టలు ఎక్కి దిగుతూ భట్టి విక్రమార్క ఆదివాసీలను కలిశారు. గిరిజనులు ఆయనను కలిసి తమ సమస్యలు వెళ్లబోసుకున్నారు. తమకు భూమి లేదని, నీళ్లు రావడం లేదని, ఇండ్లు ఇవ్వడం లేదని, రేషన్ కార్డులు వస్తలేవని, ఉద్యోగాలు లేవని మొరపెట్టుకున్నారు.
నెల రోజుల పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సాగిన పాదయాత్రలో ప్రజలు పడుతున్న కష్టాలను ప్రత్యక్ష్యంగా చూసి చలించిన భట్టి.. ‘వచ్చేది ప్రజా ప్రభుత్వమేనని, ఇందిరమ్మ రాజ్యంలో సమస్యలన్నీ పరిష్కరిస్తాం’ అని ప్రజలకు భరోసా ఇచ్చారు. వాటి పరిష్కారానికి ఎన్నికల ముందు ఆరు గ్యారంటీలను అధిష్ఠానంతో ప్రకటన చేయించడంలో సఫలీకృతం అయ్యారు. గ్యారంటీల అమలు భట్టి విక్రమార్క కృషి ఫలితమేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం ఇందుకు నిదర్శనం. ఈ యాత్ర సందర్భంగానే ప్రజల భూ సమస్యలు, నిరుద్యోగుల గోడు విన్న భట్టి ధరణి, టీఎస్‌పీఎస్సీ ప్రక్షాళలన చేస్తానని ఆ నాడే హామీ ఇచ్చారు.
అసెంబ్లీలో భట్టి నోట ఆదిలాబాద్ మాట
‘ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా అన్నా, ఇక్కడి గిరిజన, ఆదివాసీలన్నా కాంగ్రెస్ పార్టీకి, నాకు అత్యంత ఇష్టం. అందుకే ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ హయాంలో మొదలుపెట్టిన ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తిచేస్తామని అక్కడి ప్రజలందరికీ ఈ సభ ద్వారా సందేశం పంపుతున్నా.. తుమ్మిడిహెట్టి, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులు మొదలుపెడతాం. చనకా-కొరటా ప్రాజెక్టును పూర్తిచేస్తాం. కుప్టీ, త్రివేణి సంగమం, పులిమడుగు వాగు, గొల్లవాగు, చిక్మాన్ ప్రాజెక్టులకు ఈ బడ్జెట్లో నిధులు కేటాయించాం.. వాటన్నింటిని పూర్తి చేస్తాం’ అని భట్టి విక్రమార్క గత 27న అసెంబ్లీ సమావేశాల్లో ప్రసంగిస్తూ జిల్లాను ప్రత్యేకంగా ప్రస్తావించారు.
పాదయాత్ర చేసిన జిల్లాకు మళ్లీ వస్తున్న విక్రమార్క ఇక్కడి ప్రజలకు వరాల జల్లులు కురిపిస్తాడని ప్రజలు ఆశిస్తున్నారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో ఉదయం 11.30 గంటలకు పిప్రికి చేరుకోనున్న భట్టి.. అధికారులతో సమీక్ష నిర్వహించి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. సభా స్థలాన్ని మంగళవారం కలెక్టర్ రాజర్శి షా, ఐటీడీఏ పీఓ కుష్బూ గుప్తా, అడిషనల్ ఎస్పీ పరిశీలించారు.