కాళేశ్వరంపై కేసీఆర్​ను ఎందుకు విచారిస్తలేరు?: భట్టి

కాళేశ్వరంపై కేసీఆర్​ను ఎందుకు విచారిస్తలేరు?: భట్టి
  • 30 ప్రశ్నలతో మోడీకి భట్టి బహిరంగ లేఖ

మంచిర్యాల/జైపూర్, వెలుగు: హైదరాబాద్​కు శనివారం వస్తున్న ప్రధాని నరేంద్ర మోడీకి కాంగ్రెస్​ పార్టీ తరపున సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క 30 ప్రశ్నలతో బహిరంగ లేఖ రాశారు. మంచిర్యాల జిల్లా జైపూర్​మండలం ఇందారంలోని పాదయాత్ర శిబిరం వద్ద ఈ లెటర్​ను శుక్రవారం మీడియా ముందు ఆయన విడుదల​చేశారు. బీజేపీ సర్కారు తెలంగాణను పట్టించుకోవడం లేదని విమర్శించారు.

‘‘2014లో మీరు ప్రధాన మంత్రి అయినప్పటి నుంచి తెలంగాణకు కేటాయించిన పథకాలు, ప్రాజెక్టుల వివరాలు చెప్పగలరా? రాష్ట్ర విభజన చట్టంలోని హామీలను ఎన్ని నెరవేర్చారు? కాజీపేటలో రైల్వే కోచ్‌‌‌‌ ఫ్యాక్టరీని ఎందుకు ఏర్పాటు చేయడం లేదు? బయ్యారంలో ఉక్కు కర్మాగారం పనులను ఎప్పుడు ప్రారంభిస్తారు? కాళేశ్వరం ప్రాజెక్టు సీఎం కేసీఆర్‌‌‌‌కు ఏటీఎంగా మారిందని విమర్శలు చేసే మీరు (బీజేపీ నేతలు) సీబీఐ లేదా ఇతర సంస్థలతో ఎందుకు విచారణ జరిపించడం లేదు? కేసీఆర్​ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు జరిగిన సహారా, ఈఎస్‌‌‌‌ఐ స్కామ్‌‌‌‌లపై ఎందుకు విచారణ జరిపించడం లేదు? తెలంగాణలో కొత్త విద్యా సంస్థలను ఎందుకు నెలకొల్పలేదు? నిజామాబాద్‌‌‌‌ పసుపు బోర్డు ఎప్పటిలోగా తెస్తారు? ఢిల్లీ మద్యం కుంభకోణం దర్యాప్తులో ఎందుకు పురోగతి లేదు? కర్నాటక ఎన్నికల తరువాత పెట్రోల్‌‌‌‌, డీజిల్‌‌‌‌, గ్యాస్‌‌‌‌ సిలిండర్‌‌‌‌ ధరలు పెంచనని హామీ ఇవ్వగలరా? అదానీ కుంభకోణంపై జాయింట్‌‌‌‌ పార్లమెంటరీ కమిటీతో విచారణ జరిపించడానికి ఎందుకు వెనుకాడుతున్నారు?’’ అని భట్టి తన లేఖలో ప్రశ్నించారు. శనివారం హైదరాబాద్​ సభలో తన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్​ చేశారు.