దామన్నా.. మజాకా!

  •  సూర్యాపేటలో మారిన భట్టి యాత్ర రోడ్డు మ్యాప్​

నల్గొండ, వెలుగు : ‌‌కాంగ్రెస్​ పార్టీ సీనియర్​ నాయకుడు, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్​ రెడ్డి సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పాదయాత్ర పై ఫైర్​అయ్యారు. తనకు తెలియకుండా భట్టి రోడ్డు మ్యాప్​ సూర్యాపేటలో ఎట్లా డిసైడ్​ చేస్తారని పార్టీ సీనియర్ల పై మండిపడ్డారు. భట్టి షెడ్యూల్​ ప్రకారం ఈనెల 19న సూర్యాపేట నియోజకవర్గంలో భట్టి పాదయాత్ర ప్రవేశించాల్సి ఉంది. కానీ నల్గొండలో ప్రియాంక సభ ఉంటుందన్న ఉద్దేశంతో మూడు రోజులు ఆలస్యమైంది. దీంతో భట్టి యాత్ర సూర్యాపేటకు 20న రాత్రి చేరే అవకాశం ఉంది. రెండు రోజుల పాటు సాగే సీఎల్పీ పాదయాత్రను ఘనంగా నిర్వహించాలని దామోదర్​రెడ్డి భావించారు. కానీ ఆయనకు ముందస్తు సమాచారం ఇవ్వక పోవడంతో మనస్తాపానికి గురైనట్లు తెలిసింది. పార్టీలో రెండు గ్రూపులు ఉండటంతో పేటలో కాంగ్రెస్ పార్టీ అస్తవ్యస్తంగా ఉంది. ఈ పరిస్థితుల్లో భట్టి యాత్రను ఏదో మొక్కుబడిగా చేస్తే పార్టీ పరువు పోతుందని దామోదర్​రెడ్డి వర్గం భావించింది. భట్టి షెడ్యూల్​లో పాదయాత్ర మొత్తం ప్రధాన రోడ్డు వెంటే సాగుతుంది. దీని వల్ల పార్టీకి పెద్దగా ప్రయోజనం ఉండదని భావించిన దామోదర్​రెడ్డి పెద్ద ఎత్తున పార్టీ కేడర్​ తరలించాలని ప్లాన్​ చేస్తున్నారు. కాబట్టి భట్టి పాదయాత్ర రోడ్డువెంబడి కాకుండా పలు గ్రామాల మీదుగా ఎస్సీ, బీసీ కాలనీల్లో సాగాలని సూచించారు. ఈ మార్పుతో పాదయాత్ర ఏడెనిమిది కిలోమీటర్లు పెరుగుతుంది. అయినప్పటికీ భట్టి సభను సక్సెస్​ చేసేందుకు దామోదర్​ రెడ్డి టీమ్ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. 

బీసీ డిక్లరేషన్​ సభ ఇప్పట్లో లేనట్లే... 

భట్టి పాదయాత్రలో భాగంగా సూర్యాపేటలో బీసీ డిక్లేరేషన్​ సభ ఉంటుంద ని పార్టీ సీనియర్లు చెప్పారు. మాజీ ఎంపీ వీహెచ్​ఆధ్వర్యంలో కర్నాటక, రాజస్థాన్​ సీఎంలు సిద్ధరామయ్య, అశోక్​ గెహ్లాట్​లను ఆహ్వానించాలని నిర్ణయించారు. ఈ మేరకు వీహెచ్​జిల్లా పార్టీ సీనియర్లు, భట్టితో కూడా సంప్రదింపులు జరిపారు. ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల నుంచి రెండు ల క్షల మంది జనాన్ని తరలించాలని అనుకున్నారు. కానీ సభ నిర్వహణ అయ్యే ఖర్చు ఎవరు భరించాలనే దానిపై జిల్లా నాయకులు క్లారిటీ ఇవ్వలేదు. అయితే శుక్రవారం గాంధీ భవన్​లో జరిగిన పీఏసీ మీటింగ్​లో బీసీ డిక్లరేషన్​ సభ డిసైడ్​ చేస్తారని అనుకున్నారు. కానీ బీసీ, ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ల పైన ఇంకా చర్చలు జరుగుతున్నాయని పీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డి ప్రకటించారు. దీంతో పేటలో బీసీ డిక్లరేషన్​ సభ ఇప్పట్లో ఉండదని తేలిపోయింది.