- సంప్రదాయాల్లో కేరళ, తెలంగాణ మధ్య సారూప్యత: భట్టి విక్రమార్క
హైదరాబాద్, వెలుగు: ఒకే వేదికపై 400 జంటలకు పెండ్లిళ్లు చేయడం గొప్ప విషయమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఇది అసాధారణ, సామాజిక బాధ్యతతో కూడిన కార్యక్రమమన్నారు. బుధవారం కేరళలోని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ నియోజకవర్గం అలప్పుజలో ఓచిర పరబ్రహ్మ దేవాలయంలో జరిగిన సామూహిక వివాహ వేడుకల్లో భట్టి పాల్గొని కొత్త జంటలకు శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. సామాజిక, ఆధ్యాత్మిక చైతన్యానికి కేంద్ర బిందువైన ఓచిర పరబ్రహ్మ టెంపుల్ నిర్వహించిన ఇలాంటి స్ఫూర్తిదాయక కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. ఇలాంటి మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఆలయ నిర్వాహకులను ఆయన అభినందించారు. సంప్రదాయాలలో కేరళ, తెలంగాణ మధ్య సారూప్యత ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలోకేరళ రెవెన్యూ శాఖ మంత్రి కె .రాజన్, పశుసంవర్ధక శాఖ మంత్రి మణి, ఎమ్మెల్యే రమేశ్ చెన్నితల తదితరులు పాల్గొన్నారు.