పంచాయతీ ఆఫీసే.. కార్పొరేట్ లెక్క!
కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం భవానీపేట పంచాయతీ భవనం అందరినీ ఆకర్శిస్తోంది. కార్పొరేట్ ఆఫీసుకు దీటుగా అన్ని హంగులతో నిర్మించిన ఈ బిల్డింగ్‌ను చూసిన ప్రతి ఒక్కరూ వావ్.. అంటున్నారు. భవనం లోపల సర్పంచ్, సెక్రటరీ, మీటింగ్ హాల్ వేర్వేరుగా ఉన్నాయి. ఉపాధి హామీ ఫండ్స్, పంచాయతీకి వచ్చిన ఇతర ఫండ్స్‌తో ఈ నిర్మాణం చేపట్టారు. ఆఫీసు ఆవరణ మొత్తం పూల మొక్కలు, చెట్లతో సుందరంగా తీర్చిదిద్దారు.
కేంద్రం ఫండ్స్ మళ్లించడం సరికాదు
కామారెడ్డి, వెలుగు: కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన 15వ ఆర్థిక సంఘం ఫండ్స్‌ను సర్పంచ్, ఉప సర్పంచ్‌లకు తెలియకుండానే పంచాయతీ అకౌంట్లలో జమ అయిన వెంటనే స్టేట్ గవర్నమెంట్ తీసుకోవడంపై కామారెడ్డి జిల్లాకు చెందిన పలువురు సర్పంచులు అసహనం వ్యక్తం చేశారు. సోమవారం జిల్లాలోని ఆయా గ్రామాలకు చెందిన సర్పంచులు కామారెడ్డిలో సమావేశమయ్యారు. 15వ ఆర్థిక సంఘం ఫండ్స్ పంచాయతీ అకౌంట్లలో జమ కాగానే తమకు సమాచారం లేకుండా ఫండ్స్ డైవర్ట్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు సర్పంచులు మాట్లాడుతూ సర్పంచ్, ఉపసర్పంచ్‌లకు 6 నెలలలుగా స్టేట్ గవర్పమెంట్ డిజిటల్ కీ ఇవ్వడం లేదన్నారు. తమకు తెలియకుండానే ఆదివారం సెలవు రోజున పంచాయతీ ఫండ్స్ స్టేట్ గవర్నమెంట్ తీసుకోవడం దారుణమన్నారు. పంచాయతీలకు కేటాయించిన ఫండ్స్ వెంటనే తిరిగి చెల్లించాలన్నారు. లేకుంటే ఆఫీసర్లపై కోర్టులో కేసులు వేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు మంగళవారం ఎంపీడీవోలు, బుధవారం కలెక్టర్‌కు వినతి పత్రం అందజేస్తామని సర్పంచ్‌లు ఫోరం ప్రతినిధులు తెలిపారు.
సిద్దుల గుట్టపై ప్రత్యేక పూజలు
ఆర్మూర్, వెలుగు: ఆర్మూర్ టౌన్‌లోని ప్రసిద్ధ నవనాథ సిద్దుల గుట్టను సోమవారం భక్తులు పెద్ద సంఖ్యలో సందర్శించారు. పురోహితులు నందీశ్వర మహారాజ్, కుమార్ శర్మ ఆధ్వర్యంలో శివాలయం, రామాలయం, అయ్యప్ప మందిరాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవ మూర్తులతో నిర్వహించిన పల్లకీ సేవ ముందు పిప్రి గల్లి భజన మండలి మహిళలు ఉత్సాహంగా భజనలు చేశారు. అనంతరం ఆర్మూర్ ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్ ఆశన్నగారి జీవన్‌రెడ్డి సహకారంతో అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే భార్య రజితారెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ శేఖర్‌రెడ్డి, బి.సుమన్, పీసీ గంగారెడ్డి, బి.కిషన్, సాయిరాజ్, సాయితేజ, మల్లయ్య, లక్ష్మణ్, ఆనంద్ పాల్గొన్నారు.
‘డబుల్’ ఇళ్లు ఎప్పుడు నిర్మిస్తరు?
పిట్లం, వెలుగు: జుక్కల్‌లో డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం కోసం శిలాఫలకం వేసి ఏళ్లు గడుస్తున్నా నిర్మించక పోవడంపై బీజేపీ నాయకులు నిరసన తెలిపారు. సోమవారం జుక్కల్‌లో మంత్రి ప్రశాంత్‌రెడ్డి వేసిన శిలాఫలకం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ మండల అధ్యక్షుడు శివాజీ పాటిల్ మాట్లాడుతూ 2016లో మొదటి విడత ఇళ్లు, 2020లో రెండోవ విడత 100 ఇళ్ల నిర్మాణానికి మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యే హన్మంత్‌షిండే శిలాఫలకం వేశారని, ఇందు కోసం రూ. 5. 04 కోట్లు మంజూరైనట్లు ప్రకటించాని గుర్తు చేశారు. ఏళ్లు గడుస్తున్నా ఒక్క ఇల్లు కూడా నిర్మించలేదన్నారు. దీనిపై ప్రజాప్రతినిధులు సమాధానం చెప్పాలన్నారు. రాబోయే రోజుల్లో ఆందోళనలు తీవ్రతరం చేస్తామన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల సెక్రటరీ పవన్, నాయకులు ప్రశాంత్, సంతోష్‌రెడ్డి, మారుతి, లక్ష్మణ్, నాందేవ్, ధర్మ పాల్గొన్నారు.