అరకొర సౌకర్యాలతో నడుస్తున్న భవిత సెంటర్స్

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: మానసిక, శారీరక దివ్యాంగుల కోసం ఏర్పాటు చేసిన భవిత కేంద్రాలు అరకొర సౌకర్యాలతో కొనసాగుతున్నాయి. శారీరక దివ్యాంగులకు సేవలందించే ఫిజియో థెరపిస్టులకు ఐదు నెలలుగా జీతాల్లేవు. ఆయాలు చాలీచాలని జీతంతో పని చేస్తున్నారు. భవిత సెంటర్లకు సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని దివ్యాంగుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. రెండేండ్లుగా దివ్యాంగ స్టూడెంట్స్​కు అవసరమైన పరికరాలను కూడా సరఫరా చేయడం లేదని చెబుతున్నారు. 

అరకొర సౌకర్యాలు..

జిల్లాలో 17 భవిత కేంద్రాలున్నాయి. వీటిలో 1,858 మంది చిన్నారులు ఉన్నారు. ఈ కేంద్రాల్లో 1,101 మంది బాలురు, 757 మంది బాలికలు చదువుకుంటున్నారు. ఇన్​ స్కూల్​ స్టూడెంట్స్​1,378 ఉన్నారు. 124 మంది హోం బేస్​డ్​ ఎడ్యుకేషన్​పొందుతున్నారు. మంచానికే పరిమితమై బడికి రాలేని 65 మంది ఉన్నారు. ఈ సెంటర్లలో కనీసం వీల్​ చైర్స్, ఫర్మీచర్​ కూడా ఉండడం లేదు. ఏడాదికి రూ.5 వేల చొప్పున ఇచ్చే మెయింటెనెన్స్​ గ్రాంట్​ రెండేండ్లుగా నిలిపివేశారు.  స్టూడెంట్స్​తో పాటు ఎస్కార్ట్​గా వచ్చే వారికి నెలకు రూ. 550 చొప్పున ఇచ్చే అలవెన్స్​ ఇవ్వడం లేదని వాపోతున్నారు. ప్రతి నెలా ఇచ్చే రీడర్  అలవెన్స్  రూ. 60ని కూడా ఇవ్వడం లేదు.  ఇక కొన్ని కేంద్రాల్లో ర్యాంపులు శిథిలావస్థకు చేరుకున్నాయి. వినికిడి లోపం పరికరాల పంపిణీ జాడ లేదు. కొందరు పిల్లలకు సర్జరీలు అవసరమని నిర్ధారించినా ఇప్పటికీ చేయలేదు.  ఏడు సెంటర్లలో మాత్రమే ఫిజియోథెరపీకి సంబంధించి కొన్ని పరికరాలుండగా, మిగిలిన వాటిలో లేవు. 17 సెంటర్లలో ఏడుగురు ఫిజియోథెరపిస్టులు మాత్రమే ఉన్నారు. భవిత సెంటర్లలో పని చేస్తున్న ఆయాలకు నెలకు ఇచ్చే రూ.3 వేలు కూడా ఐదు నెలలుగా రావడం లేదు. 

భవిత సెంటర్లపై చిన్నచూపు

శారీరక, మానసిక దివ్యాంగుల కోసం ఏర్పాటు చేసిన భవిత సెంటర్లపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. అవసరమైన పరికరాలను అందుబాటులో ఉంచడం లేదు. హెల్త్​ క్యాంప్​లు నిర్వహించడంతో పాటు ఫిజియోథెరపిస్ట్​లకు, ఆయాలకు కనీస వేతనం చెల్లించాలి. - సతీశ్​​గుండపనేని, వికలాంగ జేఏసీ చైర్మన్