వరుస మ్యూజికల్ హిట్స్‌తో దూసుకెళ్తున్నాడు సంగీత దర్శకులు భీమ్స్. ఆయన సంగీతం అందించిన తాజా చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’లోని పాటలు మిలియన్ వ్యూస్‌తో సెన్సేషనల్ హిట్స్‌గా నిలిచాయి. వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం జనవరి 14న రిలీజ్ అవుతున్న సందర్భంగా భీమ్స్ సిసిరోలియో ఇలా ముచ్చటించారు.
ధమాక, మ్యాడ్, బలగం, రజాకార్, టిల్లు స్క్వేర్ లాంటి వరుస విజయాల తర్వాత ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంతో నాకు మరో గొప్ప అవకాశం దక్కింది. దిల్ రాజు గారి బ్యానర్‌లో ‘బలగం’కి పనిచేశాను. మళ్లీ ఆయన సంస్థలో అనిల్ రావిపూడి గారితో కలిసి పనిచేసే అవకాశం వచ్చింది. అదికూడా వెంకటేష్ గారి సినిమాకు కావడం నా అదృష్టం. ఇదంతా పాటకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా. పాట ద్వారా అందరికీ చేరువైనందుకు సంతోషంగా ఉంది.
వెంకటేష్ గారి సినిమాకి మ్యూజిక్ ఇస్తున్నానని తెలియగానే ఆయన నటించిన సినిమాలు, పోస్టర్స్‌తో నా కళ్లలో ఓ షో రీల్ కనిపించింది. అలాంటిది ఇందులోని ‘బ్లాక్ బస్టర్ పొంగల్’ పాటను స్వయంగా ఆయన పాడతాననడం ఓ కలలా అనిపించింది. సంగీత దర్శకుడిగా నాకది ఓ అచీవ్‌మెంట్. వెంకటేష్ గారి నుంచి చాలా నేర్చుకున్నా. ఇక ఈ సినిమా పాటలు ప్రతి ఇంట్లో, ప్రతి పల్లెలో వినిపిస్తున్నాయంటే.. సంగీతం, సాహిత్యం పట్ల అనిల్ గారికి ఉన్న అభిరుచి కారణం.
రమణ గోగుల గారు పాడిన ‘గోదారి గట్టు’ పాట 70 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసి ట్రెండింగ్‌లో ఉండటం ఫుల్ హ్యాపీ. ఆయన పాడటానికి ఒప్పుకోవడమే లక్కీగా ఫీలయ్యా. పాట వినగానే ఇందులో సోల్ ఉందని ఆయన ఒప్పుకున్నారు. మధుప్రియ కూడా చాలా బాగా పాడింది. అలాగే నేను పాడిన ‘మీను’ పాట 17 మిలియన్ వ్యూస్‌తో ట్రెండింగ్‌లో ఉంది. ‘బ్లాక్ బస్టర్ పొంగల్’ పాట ఎలా ఉందో అలాంటి ఓ బ్లాక్ బస్టర్ సినిమాని ప్రేక్షకులు చూడబోతున్నారు. ఇది ఫ్యామిలీ అంత కలిసి చూసి ఎంజాయ్ చేసే క్లీన్ ఎంటర్‌టైనర్.
ప్రస్తుతం మ్యాడ్ 2, మాస్ జాతర, టైసన్ నాయుడు, డకాయిట్ సినిమాలు చేస్తున్నా. ఇలా బిజీ అవడం పట్ల ఇంకా ఎక్కువ పనిచేసే అవకాశం వచ్చిందని అనుకుంటాను తప్ప మరో మెట్టు పైకి ఎక్కినట్లు భావించను. నాద్వారా ఎక్కువ మందికి పని ఇచ్చే అవకాశంగానే దాన్ని చూస్తాను. ఇక నా పాట రూటెడ్‌గా ఉండటానికి కారణం.. నేను జనంతో మమేకమై ఉండటమే. నేను ప్రజాస్వామ్యం లాంటి వాడిని. జనానికి ఏం కావాలో వాళ్ల దగ్గర నుంచే తీసుకుని తిరిగి వాళ్లకే ఇస్తున్నా. ప్రేక్షకుల భాషలో, వాళ్లకు అర్థమయ్యే రీతిలో, వాళ్లకు నచ్చే బాణీలో పాటలు చేస్తున్నా”.