ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా  భిక్షమయ్య, ప్రభాకర్, విద్యాసాగర్​కు దక్కని చాన్స్​

యాదాద్రి, వెలుగు : ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపిక నల్గొండ బీఆర్​ఎస్​ నేతలను షాక్​కు గురి చేసింది. మ్మెల్యే కోటా నుంచి దేశ్​పతి శ్రీనివాస్, ప్రస్తుత ఎమ్మెల్సీ  కుర్మయ్యగారి నవీన్​కుమార్, మాజీ ఎమ్మెల్యే చల్లా వెంకట్రామిరెడ్డిని ఎంపిక చేస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో కనీసం ఒక ఎమ్మెల్సీ పదవి కచ్చితంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాకే దక్కుతుందని ఆశించిన బీఆర్ఎస్ లీడర్లు నారాజ్​అవుతున్నారు. యాదాద్రి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి పదవీ కాలం ఈనెల29తో ముగుస్తున్న విషయం తెలిసిందే. ఈ పదవిపై గడిచిన ఆరు నెలలుగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో తీవ్ర స్థాయిలో చర్చ నడుస్తోంది. ఈ పదవిని కచ్చితంగా బీసీలకే ఇస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.  పైగా మునుగోడు టికెట్ ఆశించిన కర్నె ప్రభాకర్​కు అవకాశం రాకపోవడంతో ఆయనకే ఇస్తారనే టాక్​ నడిచింది.  అలాగే మండలి మాజీ వైస్ చైర్మన్ నేతి విద్యాసాగర్​కు ఇస్తారంటూ ప్రచారం జరిగింది. మునుగోడు ఉప ఎన్నికల సమయంలో బీజేపీ నుంచి బీఆర్ఎస్​లో చేరిన మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్​కు  ఎమ్మెల్సీ పదవిపై  సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారన్న ప్రచారమూ జరిగింది. దీంతో ఆయనకే ఎమ్మెల్సీ పదవి ఖాయమని అనుకుంటున్న సమయంలో ఉమ్మడి జిల్లాకు చెందిన వారిలో ఎవరికీ అవకాశం ఇవ్వకపోవడంపై తీవ్రస్థాయిలో చర్చ నడుస్తోంది. 

‘బూడిద’పైనే ఎఫెక్ట్​? 

ఎమ్మెల్సీ పదవిపై సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణ యం చాలాకాలంగా బీఆర్ఎస్​లోనే ఉంటున్న మాజీ ఎమ్మెల్సీలు నేతి విద్యాసాగర్, కర్నె ప్రభాకర్​పై పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదు. కానీ ఏడాదిలో రెండుమార్లు పార్టీ మారిన మాజీ ఎమ్మెల్సీ బూడిద భిక్షమయ్య గౌడ్ రాజకీయ భవిష్యత్​పై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందనే చర్చ నడుస్తోంది. ఉమ్మడి ఏపీలో 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆలేరు నియోజకవర్గం నుంచి బూడిద భిక్షమయ్య గౌడ్ కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందారు. 2014, 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. కాంగ్రెస్​లో ఉండగా కోమటిరెడ్డి బ్రదర్స్​తో ఆయ నకు విభేదాలొచ్చాయి. 2018 ఎన్నికల్లో తాను ఓడిపోవడానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రధాన కారణమని ఆరోపిస్తూ ఆయన బీఆర్ఎస్​లో చేరారు.

ఆ తర్వాత ఆయనకు పార్టీలో ప్రాధాన్యం ఇవ్వలేదు. ఎన్నికల్లో తనకు ప్రత్యర్థిగా పోటీ చేసిన భిక్షమయ్యను ఎమ్మెల్యే గొంగిడి సునీత పట్టించుకోలేదు. దీంతో తీవ్ర అసంతృప్తికి లో నైన భిక్షమయ్య గతేడాదిలో బీజేపీలో చేరారు. ఆ తర్వాత నవంబర్​లో జరిగిన మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా భిక్షమయ్య​ను సీఎం కేసీఆర్ ప్రగతి భవన్​కు పిలిపించుకొని మాట్లాడారు. ఆ సమయంలోనే ఎమ్మెల్సీ పదవి ఇస్తానని స్పష్టంగా హామీ ఇచ్చినట్టుగా బూడిద భిక్షమయ్య సన్నిహితులు చెప్పుకొచ్చారు. పైగా గౌడ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరడం, సీఎం కేసీఆర్ స్వయంగా హామీ ఇచ్చినందున గౌడ్ సామాజిక వర్గానికే చెందిన భిక్షమయ్యకే  ఎమ్మెల్సీ పదవి దక్కుతుందని చాలా మంది భావించారు.

ఆదివారం రాత్రి కూడా భిక్షమయ్యకే ఎమ్మెల్సీ పదవి ఇస్తున్నట్టుగా బీఆర్ఎస్ వర్గాల నుంచి సమాచారం అందిందని అంటున్నారు. ఈ తరుణంలో  తీరా సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో బూడిద భిక్షమయ్య రాజకీయ భవిష్యత్ ఏంటనే చర్చ మొదలైంది. ఇదిలా ఉండగా  సీఎం కేసీఆర్ తమ నాయకుడికి ఇచ్చిన హామీని నిలుపుకుంటారని భిక్షమయ్య అనుచరవర్గం ఆశిస్తోంది. గవర్నర్ కోటాలోనైనా ఎమ్మెల్సీ పదవిని ఇస్తారని భావిస్తున్నారు. ఇది సాధ్యం కాకుంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఆలేరు నుంచి టికెట్ ఇస్తారని అంటున్నారు. అయితే ఆలేరు సిట్టింగ్ ఎమ్మెల్యే గొంగిడి సునీతను కాదని వచ్చే ఎన్నికల్లో  భిక్షమయ్యకు టికెట్ ఇచ్చే అవకాశం లేదని కొందరు లీడర్లు అభిప్రాయపడుతున్నారు.

ఆనందంలో సునీత అనుచరులు!

బూడిద భిక్షమయ్యకు ఎమ్మెల్సీగా సీఎం కేసీఆర్ అవకాశం ఇవ్వక పోవడంతో ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత అనుచ రుల్లో ఆనందం కన్పిస్తోంది. భిక్షమయ్య కు ఎమ్మెల్సీ ఇచ్చినట్టయితే యాదాద్రి జిల్లాలో.. ముఖ్యంగా ఆలేరు నియోజక వర్గంలో బీఆర్ఎస్ రెండు శిబిరాలుగా చీలేదని, సీఎం కేసీఆర్ నిర్ణయంతో ఆ ప్రమాదం తప్పిందని అంటున్నారు.