గేటు వేస్తలేరని స్టూడెంట్స్ను రోడ్డున పడేసిన ఇంటి ఓనర్

గేటు వేస్తలేరని స్టూడెంట్స్ను రోడ్డున పడేసిన ఇంటి ఓనర్

హనుమకొండ : భీమారంలోని ఓ ప్రయివేటు హాస్టల్ బిల్డింగ్ యాజమాని నిర్వాకంతో 50 మంది విద్యార్థులు రోడ్డున పడ్డారు. శశాంక్ బాయ్స్ హాస్టల్ విద్యార్ధులను కానిస్టేబుల్ అయిన బిల్డింగ్ ఓనర్ రాజయ్య అకారణంగా బయటకు గెంటేసి ఇంటికి తాళం వేసుకున్నాడు. విద్యార్థులంతా డిప్లొమా, బీటెక్ చదువుతున్నారు. ఇంటిని ఖాళీ చేయాలంటూ రెండు రోజులుగా ఇబ్బంది పెడుతున్న ఓనర్ ఇవాళ ఉదయం వారి దుస్తులు, ఇతర సామాగ్రి బయట పడేశాడు. దీంతో విద్యార్థులు రోడ్డుపై బైఠాయించారు.

హాస్టల్ నిర్వాహకులు 20 రోజుల క్రితమే బిల్డింగ్ లో కొత్తగా హాస్టల్ ఏర్పాటు చేశారు. అయితే గేటు వేయడం లేదన్న చిన్న కారణంతో విద్యార్థులను వేధిస్తున్న ఇంటి ఓనర్ రెండు మూడు రోజులుగా వారిపై నోరుపారేసుకుంటున్నాడు. హాస్టల్ నిర్వాహకులతో మాట్లాడి వెళ్తామన్నా.. వినకుండా తెల్లవారు జామున తమ సామాన్లను బయట పడేశాడని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటి ఓనర్ కారణంగా రెండు రోజులుగా క్లాసులకు కూడా అటెండ్ కాలేకపోతున్నామని అన్నారు. అధికారులు స్పందించి తమకు సాయం చేయాలని విద్యార్థులు కోరుతున్నారు.