యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి ప్రఖ్యాత ‘భోగ్’ (బ్లిస్ ఫుల్ హైజీన్ ఆఫరింగ్ టు గాడ్) సర్టిఫికెట్ లభించింది. ప్రసాదాల తయారీలో అన్ని రకాల ప్రమాణాలు పాటిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ, సంక్షేమ శాఖ పరిధిలోని ఆహార భద్రత ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) ఈ గుర్తింపు ఇచ్చింది. స్వామివారికి నివేదించే ప్రసాదంతో పాటు భక్తులకు ఇచ్చే లడ్డూ, పులిహోర తదితర ప్రసాదాల తయారీలో అన్ని రకాల ప్రమాణాలు పాటిస్తూ క్వాలిటీ మెయింటేన్ చేస్తున్నట్లు నిర్ధారించి యాదగిరిగుట్ట టెంపుల్ కు ఈ సర్టిఫికేట్ ను అందజేసింది. ఎఫ్ఎస్ఎస్ఏఐ సీఈఓ కమలవర్ధన్ రావు శనివారం గుట్ట అధికారులకు ఈ సర్టిఫికెట్ ను అందజేశారు.
దేశంలో మొత్తం 70కి పైగా దేవాలయాలు భోగ్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకోగా.. రాష్ట్రంలో యాదగిరిగుట్ట టెంపుల్ తో పాటు వర్గల్ దేవాలయాలు మాత్రమే ఈ సర్టిఫికెట్ కు సెలెక్ట్ అయ్యాయి. ఇప్పటివరకు మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని వంటి ప్రముఖ ఆలయాలకు మాత్రమే ఈ గుర్తింపు లభించగా.. తాజాగా ఆ జాబితాలో గుట్ట ఆలయానికి కూడా చోటు లభించింది. భోగ్ సర్టిఫికెట్ కోసం గుట్ట ఆలయ అధికారులు దరఖాస్తు చేయగా కేంద్రం నుంచి వచ్చిన ప్రత్యేక ఆడిట్ బృందం.. యాదగిరిగుట్ట ఆలయాన్ని సందర్శించింది. నైవేద్యం, అన్నప్రసాదాల నాణ్యత, కిచెన్ నిర్వహణ, ఆహారం తయారు చేసే విధానాన్ని స్వయంగా పరిశీలించి భోగ్ గుర్తింపుకు రెఫర్ చేసింది. ఫైనల్ ఆడిట్ జరిపిన తర్వాత రాష్ట్రంలో యాదగిరిగుట్ట, వర్గల్ ఆలయాలను భోగ్ సర్టిఫికెట్ కు ఎంపిక చేసింది. ఈ సర్టిఫికెట్ రావడానికి కృషి చేసిన రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ విభాగానికి గుట్ట ఆలయ ఈఓ రామకృష్ణారావు కృతజ్ఞతలు తెలిపారు.