తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా భోగి సంబురాలు

తెలుగు రాష్ట్రాల్లో  భోగి పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. పల్లెలు, పట్నాలు అన్న తేడా లేకుండా జనం పొద్దున్నే లేచి భోగి మంటలు వేసుకున్నారు. తమ లోగిళ్ల ముందు భోగి మంటల కాంతులు విరజిమ్మాయి. ఆ తర్వాత తమ ఇండ్ల ముందు రంగురంగుల ముగ్గులు వేస్తూ సందడి చేశారు. 

హైదరాబాద్ కేబీఆర్‌ పార్క్‌ వద్ద భారత్‌ జాగృతి ఆధ్వర్యంలో భోగి వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, గంగిరెద్దుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. 

సిటీలోని పలు చోట్ల  రాత్రి నుండే గేటెడ్ కమ్యూనిటీల్లో ప్రజలు ఆనందంగా భోగి మంటలు వేసి సంక్రాంతి సంబరాల్లో మునిగిపోయారు. కూకట్ పల్లి రెయిన్ బో విస్టా గేటెడ్ కమ్యూనిటీలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భోగి మంటల చుట్టూ ఉత్సాహంగా ఆడిపాడారు.  ఈ ఉత్సవాల్లో చిన్నాపెద్దా  తేడాలేకుండా సందడి చేశారు. 

వరంగల్‌ జిల్లా పర్వతగిరిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ భోగి వేడుకల్లో పాల్గొన్నారు. కుటుంబసభ్యులు, గ్రామస్తులతో కలిసి భోగిమంటల చుట్టూ ఆడిపాడారు. ఈ ఏడాది ప్రజలకు అంతాశుభం జరగాలని  ఆయన కోరుకున్నారు.  

అటు సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఘనంగా భోగి మంటల సంబరాలు నిర్వహించారు. సూర్యాపేట పట్టణంలో పలు కూడళ్ళలో జరిగిన భోగి వేడుకల్లో మంత్రి జగదీష్ రెడ్డి పాల్గొన్నారు. స్థానికులతో కలిసి  భోగి మంటల చుట్టూ ఆడిపాడారు.