న్యూఢిల్లీ, వెలుగు: పత్తి కొనుగోలు విషయంలో కాటర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) రైతులను ఇబ్బంది పెడుతోందని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. మంగళవారం ఢిల్లీలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో ఎంపీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పత్తి రైతులను సీసీఐ ఇబ్బందులు పెడుతున్న విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
నాణ్యమైన సరఫరా విధానం, ఇతర కొలతలను బ్యాగ్ చేయడం, ఇతర అంశాల పేరుతో పేద చిన్న, సన్నకారు రైతులను సీసీఐ అధికారులు ఆందోళనకు గురిచేస్తున్నారని వివరించారు. పత్తిని రైతు మార్కెట్‌కు తీసుకువచ్చిన తర్వాత తప్పనిసరిగా కొనుగోలు చేయాల్సిన బాధ్యత సీసీఐపై ఉంటుందని గుర్తు చేశారు. అందువల్ల పత్తి కొనుగోళ్లలో అవాంతరాలు సృష్టించి రైతులను సీసీఐ ఇబ్బంది పెట్టకుండా చూడాలని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను రిక్వెస్ట్ చేశారు.