భూదానోద్యమం.. అప్పటి హైదరాబాద్​ ప్రభుత్వం నిబంధనలు ఇవే..

భూదానోద్యమం.. అప్పటి హైదరాబాద్​ ప్రభుత్వం నిబంధనలు ఇవే..

ఆంగ్ల తత్వవేత్త సర్​ జాన్​ రస్కిన్​ రచించిన గ్రంథం ఆన్​ టూ ది లాస్ట్​ను చదివిన మహాత్మాగాంధీ ఎంతో ప్రభావితుడై ఆ గ్రంథాన్ని ఆయన గుజరాతీ భాషలోకి సర్వోదయ పేరుతో అనువాదం చేశారు. ఆ తర్వాత కాలంలో సర్వోదయ సమితి ఏర్పడింది. సర్వోదయ అంటే సాంఘిక పునర్నిర్మాణం లేదా అందరి సంక్షేమం అని అర్థం. 

హైదరాబాద్​ రాష్ట్రం విమోచనానికి ముందు ముందు రజాకార్ల వల్ల, విమోచనం తర్వాత పోలీసులు, కమ్యూనిస్టుల సాయుధ పోరాటం వల్ల అల్లకల్లోలమైన తెలంగాణలో శాంతియాత్ర జరపాలని సర్వోదయ నాయకులు నిర్ణయించారు. మహాత్మాగాంధీ ముఖ్య అనుచరుల్లో ఒకడైన ఆచార్య వినోబా భావే సర్వోదయ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లే బాధ్యత తీసుకున్నాడు.

సర్వోదయ సమితి మూడో సమావేశం 1951, ఏప్రిల్​ 8 నుంచి 11 మధ్య హైదరాబాద్​ సమీపంలోని శివరాంపల్లిలో జరిగింది. ఈ సమావేశానికి వినోబాభావే హాజరయ్యాడు. 1951 ఏప్రిల్​ 15న శివరాంపల్లి నుంచి వినోబాభావే తన శాంతియాత్రను ప్రారంభించాడు. ఆయన వెంట మెల్కోటే, మర్రి చెన్నారెడ్డి తదితరులు ఉన్నారు. 1951, ఏప్రిల్​ 18న వినోబాభావే బృందం నల్లగొండ జిల్లా భువనగిరి తాలుకా పోచంపల్లి (ప్రస్తుతం భువనగిరి యాదగిరి జిల్లా)కి చేరారు. పోచంపల్లిలో ఏర్పాటు చేసిన సమావేశంలో వినోబాభావే ప్రసంగించారు. 

ఈ సమావేశానికి హాజరైన కొందరు హరిజనులు తమకు దున్నుకోవడానికి కొంత భూమిని ఇప్పించాలని కోరారు. అప్పుడు పోచంపల్లి గ్రామానికి చెందిన వెదిరి రామచంద్రారెడ్డి తన తండ్రి పేరున హరిజనులకు పంచడానికి తాను 100 ఎకరాల భూమిని దానంగా ఇస్తున్నానని ప్రకటించారు. వెదిరి రామచంద్రారెడ్డి తన 100 ఎకరాల భూమిని దానం చేస్తున్నట్లు దాన పత్రాన్ని రాసి వినోబాభావేకు ఇచ్చాడు. దాంతో భూదానోద్యమంలో మొదటి భూదాతగా వెదిరి రామచంద్రారెడ్డి గుర్తింపు పొందాడు. ఆ విధంగా 1951, ఏప్రిల్​ 18న పోచంపల్లి గ్రామంలో భూదానోద్యమం ప్రారంభమైంది. 

వినోబాభావే మొదటి పాదయాత్ర
వినోబాభావే మొదటి పాదయాత్ర ఇన్​చార్జిగా కేతిరెడ్డి కోదండరామిరెడ్డి వ్యవహరించాడు. 1951, ఏప్రిల్​ 18న వినోబాభావే భూదానోద్యమ మొదటి పాదయాత్రను పోచంపల్లి నుంచి ప్రారంభించారు. ఈ పాదయాత్ర తెలంగాణలో 51 రోజులపాటు దాదాపు 200 గ్రామాల్లో జరిగింది. చాలామంది భూస్వాములు దాదాపు 12,000 ఎకరాల భూమిని దానం చేశారు. వినోబాభావే భూస్వాములను తమ భూమిలో కనీసం 1/6 వంతును దానంగా ఇవ్వమని కోరేవాడు. 

సూర్యాపేటలో కేతిరెడ్డి కోదండ రామిరెడ్డి ఆయన సోదరుడు కేతిరెడ్డి పురుషోత్తమరెడ్డి తమ భూమిలో నాలుగో భాగం భూదానంగా ప్రకటించారు. ఈ విధంగా భూదానోద్యమం ద్వారా దానంగా వచ్చిన భూమిని పేదలకు పంచడానికి మొదట 1951, జూన్​లో వినోబాభావే హైదరాబాద్​ భూదాన యజ్ఞ సమితిని ఏర్పాటు చేశాడు. దీనికి కన్వీనర్​గా ఉమ్మెత్తుల కేశవరావు, సభ్యులుగా కేతిరెడ్డి కోదండరామిరెడ్డి, సంగం లక్ష్మీభాయిలను నియమించారు. ఈ సమితి ఒక నియమావళిని రూపొందించి భూదానోద్యమం ద్వారా లభించిన భూమిని పేదలకు పంచింది. 

కాలక్రమంలో ఈ సమితి రాష్ట్ర భూదాన యజ్ఞ బోర్డుగా మారింది. రాష్ట్ర భూదాన యజ్ఞ బోర్డు అధ్యక్షులుగా ప్రభాకర్​, సభ్యులుగా ఉమ్మెతల కేశవరావు, కేతిరెడ్డి కోదండరామిరెడ్డి, వెదిరె రామచంద్రారెడ్డి, సి.వి.చారి, ఆర్​.కె.రామ్​ మొదలైన వారు ఉన్నారు. కేతిరెడ్డి కోదండరామిరెడ్డి తన ఆత్మకథ నిన్నటి ఇతిహాసంలో భూదానోద్యమ విశేషాలను వివరించాడు. హైదరాబాద్​ చివరి నిజాం ఉస్మాన్ అలీఖాన్​ వినోబాభావే మొదటి భూదానయాత్ర సందర్భంలో 3500 ఎకరాల భూమిని దానంగా ఇచ్చాడు. 

వినోబాభావే మొదటి పాదయాత్ర తెలంగాణలో చివరకు ఆదిలాబాద్​ జిల్లా ఆసిఫాబాద్​ చేరుకుని అక్కడి నుంచి మహారాష్ట్రలోని చంద్రాపూర్​ జిల్లాలోకి ప్రవేశించింది. ఈ విధంగా తెలంగాణలో ప్రారంభమైన భూదానోద్యమం అనతికాలంలోనే భారతదేశంలోని అన్ని ప్రాంతాలకు పాకింది. దీనిపై అప్పటి ప్రధాని నెహ్రూ స్పందిస్తూ భారతదేశ ప్రభుత్వపు 50 వేల సైన్యం చేయలేని పని ఒక బక్కచిక్కిన మనిషి తెలంగాణలో చేస్తున్నాడని పేర్కొన్నాడు. 

భూదాన నిబంధనలు
అప్పటి హైదరాబాద్​ ప్రభుత్వం రాష్ట్రంలో భూదాన భూముల సేకరణ, పంపిణీ ప్రక్రియలను శాసనబద్ధం చేయడానికి వీలుగా ఒక నియమావళిని రూపొందించింది. ఈ నియమావళిని అనుసరించి భూమిని దానం చేయాలనుకునే వ్యక్తి భూమిపై తన హక్కులను వదులుకుంటూ ఒక రాజీనామా పత్రాన్ని తహసీల్దార్​కు ఇవ్వాలి. తహసీల్దార్ భూమికి సంబంధించిన విషయాలను విచారించి ఆ భూమిపై ప్రభుత్వ రుణాలు గానీ, శిస్తు బకాయిలు గానీ లేని పక్షంలో ఆ భూమిని భూదానంగా స్వీకరించి ఖారీజ్​ ఖాతా భూమిగా నమోదు చేసుకుంటాడు. అనంతరం ఈ భూమిని భూమిలేని పేదలకు దానం చేయడానికి కొన్ని నిబంధనలు రూపొందించారు. 

1. భూమిని దానం చేసిన వ్యక్తిని భూదాతగాను, భూమిని గ్రమించిన వ్యక్తిని భూగ్రహీతగాను పరిగణిస్తారు. భూగ్రహీత ఆ గ్రామంలోని వ్యవసాయ సహకార పరపతి సంఘంలో తప్పనిసరిగా సభ్యత్వం పొందాలి. ఈ షరతు వితరణ పత్రంలో స్పష్టంగా పేర్కొన్నారు. 

2. భూమి లభించిన రెండు సంవత్సరాల్లో వ్యవసాయ యోగ్యత ప్రాతిపదికగా భూగ్రహీత వ్యవసాయం ఆరంభించాలి. 

3. భూగ్రహీతకు భూమిని గ్రహించి వ్యవసాయం ఆరంభించిన మొదటి మూడేండ్లు భూమిశిస్తు మినహాయింపు ఉంటుంది.
 
4. భూగ్రహీత దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న పేద కుటుంబానికిచెందిన వాడైతే, గ్రహీత పేరున భూమిని నమోదు చేయడానికి ఏ విధమైన స్టాంపు డ్యూటీ ఉండేది కాదు.

రెండో పాదయాత్ర
తెలంగాణలో వినోబాభావే భూదానోద్యమ రెండో పాదయాత్ర 1955, డిసెంబర్​లో ఖమ్మం జిల్లాలోని ఎర్రపాలెం నుంచి ప్రారంభమైంది. ఈ యాత్రకు తెలంగాణ సరిహద్దుల్లోని కొల్లురు(ఖమ్మం జిల్లా)లో అప్పటి హైదరాబాద్​ సీఎం బూర్గుల రామకృష్ణారావు, ఇతర సర్వోదయ నాయకులు వినోబాభావేకు స్వాగతం పలికారు. ఈ యాత్ర 1956, ఫిబ్రవరి 5న హైదరాబాద్​కు చేరుకుంది. వినోబాభావే హైదరాబాద్​లో ఇండియన్ మెడికల్​ అసోసియేషన్​ భవనంలో బస చేశాడు. అప్పుడు ఆయనను చాలా మంది ప్రముఖులు కలుసుకున్నారు. వారిలో నవాబ్​ దీన్​యార్​ జంగ్​, ప్రిన్స్​ ఆఫ్​ బేరార్​, మెల్కోటే, మర్రి చెన్నారెడ్డి, జె.వి.నర్సింగరావు, పద్మజానాయుడు ముఖ్యమైనవారు. 

భూదాన ఉద్యమానికి మద్దతుగా 1956, ఫిబ్రవరి 6న హైదరాబాద్​లో విద్యార్థులు ఒక ఊరేగింపును జరిపి వివేకవర్ధిని కాలేజీ ఆవరణలో ఒక బహిరంగ సభను నిర్వహించారు. 1956, ఫిబ్రవరి 8న భారత రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్​ హైదరాబాద్​ రాష్ట్రాన్ని సందర్శించినప్పుడు పాలమాకుల గ్రామంలో వినోబాభావేను కలుసుకొని 3 గంటలపాటు భూదానోద్యమ యాత్రలో పాల్గొన్నాడు. నాటి భారత ప్రధాని నెహ్రూ 1956, మార్చి 5న రాష్ట్రానికి వచ్చినప్పుడు మహబూబ్​నగర్​ జిల్లాలోని మాధవరావు పల్లెలో వినోబాభావేను కలుసుకుని భూదానోద్యమానికి తన పూర్తి సహకారం ఉంటుందని పేర్కొన్నాడు. 

ఈ రెండో భూదాన యాత్రకూ కేతిరెడ్డి కోదండరామిరెడ్డి ఇన్​చార్జిగా వ్యవహరించాడు. ఈ రెండో భూదాన పాదయాత్ర తెలంగాణలోని మహబూబ్​నగర్​ జిల్లా ఆలంపూర్​ చివరి మజిలీగా మారి రాయలసీమలోకి ప్రవేశించింది. వినోబాభావేతన రెండో భూదానయాత్ర ద్వారా 42,000 ఎకరాలను భూదానంగా పొందాడు. 

అయితే, వినోబాభావే తెలంగాణలో ప్రారంభించిన భూదాన యాత్రలో ఆయనతోపాటు ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఉండటంతో కమ్యూనిస్టులు భూదానోద్యమ యాత్రను వ్యతిరేకించారు. వినోబాభావే కూడా ప్రభుత్వ ఏజెంట్​ అని విమర్శించారు. భూదానోద్యమం ప్రారంభించిన మొదటి 15 సంవత్సరాల్లో దాదాపు 42 లక్షల ఎకరాల భూమిని దేశవ్యాప్తంగా సేకరించి పేదలకు పంచారు.