పోటీలో పోచంపల్లి

పోచంపల్లి.. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చినంక భూదానాలు చేయడం వల్ల భూదాన్‌‌ పోచంపల్లిగా మారింది. స్వాతంత్ర్యం రాకముందు అరబ్ దేశాలకు గాజులు పంపడంవల్ల ‘గాజుల పోచంపల్లి’ గా పేరు వచ్చింది. పోచంపల్లి చీరలతో దునియా మొత్తం ఫేమస్‌‌ అయ్యింది. ఎక్కడెక్కడ నుంచో జనాలు ఇక్కడికి వచ్చి చీరలు కొంటారు. ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ కాంటెస్ట్‌‌కు నామినేట్‌‌ అయింది మన పోచంపల్లి. 

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌‌‌‌కు సుమూరు 42 కిలోమీటర్ల దూరంలో ఉంది భూదాన్‌‌‌‌ పోచంపల్లి. హైదరాబాద్​ – విజయవాడ హైవే నుంచి 11 కిలోమీటర్లు లోపలికి వెళ్లాలి. పోచంపల్లి లోకి వెళ్తుంటే చుట్టూ కొండలు, రోడ్డుకు అటూ ఇటూ పచ్చని చెట్లు మనకి వెల్‌‌‌‌కం చెప్తాయి. ఆ తర్వాత ఊళ్లోకి వెళ్లగానే పోచంపల్లి, ఇక్కత్‌‌‌‌ చీరల షాపులు ఉంటాయి. చీరలు కొనేందుకు వచ్చిన జనాలతో భూదాన్‌‌‌‌ పోచంపల్లి ఎప్పుడూ సందడిగా ఉంటుంది. సిల్క్‌‌‌‌ సిటీగా పేరు పొందిన పోచంపల్లికి ఇప్పుడు ప్రపంచ స్థాయి గుర్తింపు వచ్చింది. ‘యునైటెడ్​ నేషన్స్​ వరల్డ్​ టూరిజం ఆర్గనైజేషన్’ (యుడబ్ల్యూటీఏ) నిర్వహించిన కాంటెస్ట్‌‌‌‌కి నామినేట్‌‌‌‌ అయ్యింది. మన దేశం నుంచి నామినేట్‌‌‌‌ అయిన మూడు ఊళ్లలో పోచంపల్లి ఒకటి కావడం విశేషం.
గాజుల పోచంపల్లి
పోచంపల్లిని గాజుల పోచంపల్లి అని కూడా పిలుస్తారు. స్వాతంత్ర్యం రాకముందు పోచంపల్లిలో గాజులు, పూసలు, తేలియా రుమాలు తయారు చేసి వాటిని అరబ్​ దేశాలకు ఎగుమతి చేసేవారు. నిజాం రాజుకు పంపేవారు. దాంతో అప్పట్లో అరబ్‌‌‌‌ దేశాలకు చెందిన వారు పోచంపల్లిని ‘గాజుల పోచంపల్లి’ అని పిలిచేవారు. 
భూదాన్​ పోచంపల్లి
గాజుల పోచంపల్లి స్వాతంత్ర్యం వచ్చాక భూదాన్‌‌‌‌ పోచంపల్లిగా మారింది. స్వాతంత్ర్యం వచ్చాక వినోబాభావే దేశ పర్యటన చేశారు. దాంట్లో భాగంగా ఆయన1951, ఏప్రిల్‌‌‌‌ 18న పోచంపల్లికి వచ్చారు. గ్రామంలోని 75 శాతం మందికి భూమి లేదని తెలుసుకుని వారికి భూమిని ఇప్పించేందుకు భూస్వాములతో మాట్లాడారు. వెదిరె రాంచంద్రారెడ్డి తన100 ఎకరాల భూమిని దానం చేశారు. ఆ తర్వాత దేశమంతా భూదానోద్యమం ప్రారంభ మైంది. భూమి లేని పేదలకు భూమి దక్కింది. అందుకే, ఇది భూదాన్‌‌‌‌ పోచంపల్లిగా మారింది.
‘బెస్ట్​ టూరిజం విలేజ్’​ కాంటెస్ట్​
గ్రామీణ పర్యాటకాన్ని అభివృద్ధి చేయడంతో పాటు అక్కడ ప్రజల లైఫ్‌‌‌‌స్టైల్‌‌‌‌ను ప్రపంచానికి తెలియజేసేందుకు యునైటెడ్​ నేషన్స్​ వరల్డ్​ టూరిజం ఆర్గనైజేషన్​ ‘బెస్ట్ టూరిజం విలేజ్  కాంటెస్ట్ ’ నిర్వహిస్తోంది. యూఎన్‌‌‌‌డబ్ల్యూటీవోలో159 దేశాలు ఉన్నాయి. ఒక్కో దేశం మూడు గ్రామాలను నామినేట్‌‌‌‌ చేయాల్సి ఉంది. దాంట్లో భాగంగా మన దేశం నుంచి మూడు గ్రామాలను ఎంపిక చేశారు. మన రాష్ట్రం నుంచి  భూదాన్​ పోచంపల్లి కాగా.. మేఘాలయ నుంచి కాంగ్‌‌‌‌దాన్, మధ్యప్రదేశ్​లోని లద్​పురాఖాస్​ను ప్రతిపాదించింది. అక్టోబర్‌‌‌‌‌‌‌‌లో జరిగే యూఎన్‌‌‌‌డబ్ల్యూటీవో సమావేశాల్లో బెస్ట్‌‌‌‌ గ్రామాలను ప్రకటిస్తారు.  
                                                                                                                                            ::: కందుకూరి సోమయ్య, యాదాద్రి, వెలుగు

నమ్మకం ఉంది
భూదాన్​ పోచంపల్లికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. భూదానోద్యమం మొదలైంది ఇక్కడే. ఇక్కత్​ వస్త్రాల కారణంగా ఇప్పటికే అంతర్జాతీయంగా గుర్తింపు ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా పర్యాటకరంగంగా గుర్తించి డెవలప్​ చేస్తోంది. ఇప్పుడు  బెస్ట్​ టూరిజం విలేజ్​గా గుర్తింపు పొందుతుందన్న నమ్మకం ఉంది. 
                                                                                                                                                       - తడక రమేష్.  పోచంపల్లి  టై&డై అధ్యక్షుడు

మరింత డెవలప్​మెంట్​
భూదాన్​ పోచంపల్లికి బెస్ట్​ టూరిజం విలేజ్​గా గుర్తింపు వస్తే ఇక్కడ డెవలప్​మెంట్​ మస్త్‌‌ జరుగుతది. ఇప్పటికే దేశంలోని చాలా రాష్ట్రాల నుంచి పర్యాటకులు వస్తున్నారు. అప్పుడప్పుడు విదేశాల నుంచి వస్తున్నరు. బెస్ట్​ టూరిజం విలేజ్​గా గుర్తింపు పొందితే పర్యాటకుల సంఖ్య పెరుగుతుంది. 
                                                                                                                                                        - రావుల మోహన్ రెడ్డి. సామాజిక కార్యకర్త.