ఆదిలాబాద్, వెలుగు : తెలంగాణ ఉద్యమకారుడు.. బీఆర్ఎస్ సీనియర్ నేత లోక భూమారెడ్డి రాజకీయాల నుంచి తప్పుకున్నారు. తన వయస్సును దృష్టిలో ఉంచుకొని శాశ్వతంగా రాజకీయాలను వదిలేస్తున్నట్లు శుక్రవారం విలేకరులతో చెప్పారు. తలమడుగు మండలం రుయ్యాడి గ్రామానికి చెందిన భూమారెడ్డి 1981 గ్రామ సర్పంచ్ గా ఎన్నికయ్యారు. వరుసగా పదిహేనేళ్లు సర్పంచ్ గా పనిచేశారు. గతంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ పదవిలో కూడా కొనసాగారు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా 2001లో ఆవిర్భవించిన టీఆర్ఎస్ పార్టీలో చేరారు.
అప్పటి నుంచి తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పనిచేశారు. పశ్చిమ జిల్లా అధ్యక్ష పదవి చేపట్టారు. 2017లో తెలంగాణ డెయిరీ డెవలప్మెంట్ చైర్మన్ గా పనిచేశారు. కాగా ఆయన బీఆర్ఎస్ లో తగిన గుర్తింపు ఇవ్వకపోవడంతోనే పూర్తి స్థాయిలో రాజకీయాల నుంచి తప్పుకున్నారంటూ జరిగిన ప్రచారాన్ని ఆయన ఖండించారు. తాను కేవలం తెలంగాణ కోసం ఇన్ని రోజులు రాజకీయాల్లో ఉన్నానని, ఇప్పుడు ఆ కల నెరవడంతో పాటు ఈ వయస్సులో రాజకీయాలు వదిలేయాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.