స్వరాష్ట్రంలో ఒక్క కుటుంబం మాత్రమే బాగుపడ్డదన్న భూపేందర్ యాదవ్

రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ విమర్శించారు. చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని లింగారెడ్డిగూడెంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన గొల్ల కురుమల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ అన్నిరంగాల్లో విఫలమైందని భూపేందర్ మండిపడ్డారు. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక్క కుటుంబం మాత్రమే బాగుపడిందని ఆరోపించారు. 

తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, అందుకోసమే తాను వచ్చానని భూపేందర్ యాదవ్ అన్నారు. రాష్ట్రంలో ప్రతి పల్లె అభివృద్ధి, ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందేలా చూసేందుకు బీజేపీ కట్టుబడి ఉందని చెప్పారు. దళిత బంధు ప్రచారానికి మాత్రమే పరిమితమైందన్న ఆయన.. ప్రజలను మభ్యపెట్టేందుకే తప్ప అవి వారి అభివృద్ధి కోసం తీసుకొచ్చిన పథకాలు కాదని అన్నారు. మునుగోడులో బీజేపీ గెలవడం అత్యవసరమని భూపేందర్ అభిప్రాయపడ్డారు. ఉప ఎన్నిక ద్వారా రాష్ట్రంలో కుటుంబ పాలనకు మునుగోడు ప్రజలు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు.