- ఎన్నికల అధికారులు, పోలీసులు బీజేపీకి ఫేవర్ చేస్తున్నారు: మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్
భోపాల్: ‘బోగస్ ఓటింగ్’పై జిల్లా పంచాయతీ కార్యాలయం వెలుపల కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ సీఎం దిగ్విజయ సింగ్, బీజేపీ ఎమ్మెల్యే విశ్వాస్ సారంగ్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలింగ్ కేంద్రం బయటే నిలిపేయడంతో ఆయన ఆగ్రహానికి లోనయ్యారు. పోలీసులు, ఎన్నికల అధికారులు ప్రభుత్వ ఒత్తిడితో బీజేపీకి ఫేవర్ చేస్తున్నారని దిగ్విజయ్ సింగ్ ఆరోపించారు. బీజేపీ నేతల కనుసన్నల్లో అధికారులు, పోలీసులు పనిచేస్తూ ఏకపక్ష ఓటింగుకు పాల్పడుతున్నారని ఆయన విమర్శించారు. నకిలీ ఓట్లను చాలా గుర్తించినా ఎన్నికల అధికారులు చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు.
నకిలీ మెడికల్ సర్టిఫికెట్లు తీసుకొచ్చి 9 ఓట్లు వేసుకున్నారని, ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. ఓటర్లను ప్రభుత్వ వాహనాల్లో తీసుకొచ్చి మరీ ఓట్లు వేయిస్తున్నారని దిగ్విజయ్ సింగ్ ఆరోపించారు. అయితే దిగ్విజయ్ సింగ్ చేస్తున్న ఆరోపణలు తప్పన్నారు మంత్రి భూపేంద్ర సింగ్, ప్రజలు స్వచ్ఛందంగా పంచాయతీ ఎన్నికల్లో పాల్గొంటున్నారన్నారు. దిగ్విజయ్ సింగ్ తో బీజేపీ నేతల వాగ్వాదం నేపధ్యంలో పోలీసులు భారీ సంఖ్యలో మొహరించారు. దీంతో స్వల్ప ఉద్రిక్తత ఏర్పడింది. మధ్యప్రదేశ్ లో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో పలు చోట్ల బీజేపీ-కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి.