జడ్పీ సమావేశం నుంచి భోథ్ ఎమ్మెల్యే వాకౌట్

ఆదిలాబాద్, వెలుగు: మిషన్ భగీరథ వాటర్ రావడం లేదు.. బడులు శిథిలావస్థలో ఉన్నయ్.. రోడ్లెస్తలేరు.. ఉపాధి పనుల్లో అక్రమాలు జరుగుతున్నయ్.. బస్సులొస్తలేవు.. ఆఫీసర్లకు చెప్పినా ఏం పట్టించుకోవడం లేదని అధికార పార్టీ ఎమ్మెల్యేలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఆదిలాబాద్ జడ్పీ సర్వసభ్య సమావేశం శనివారం జడ్పీ చైర్మన్ జనార్ధన్ రాథోడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఉదయం 11 గంటలకు మొదలైన సమావేశం ఏడుగంటలపాటు కొనసాగింది. 42 అంశాలపై చర్చిస్తే 20పైగా అంశాలపై ఎమ్మెల్యే, జడ్పీటీసీ సభ్యులు అసహనం వ్యక్తం చేశారు. ఆయా పనుల ఆలస్యం.. అధికారుల నిర్లక్ష్యంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఉదయం సమావేశం ప్రారంభంలోనే బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు ఉపాధి పనుల్లో అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆఫీసర్లు తన మాట వినడం లేదంటూ సమావేశాన్ని వాకౌట్ చేసి వెళ్లిపోయారు. ఉపాధి పనుల్లో అక్రమాలపై ఎంపీడీఓ రాధను శుక్రవారం రాత్రి కలెక్టర్ సస్పెండ్ చేశారు. కలెక్టర్​నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బోథ్ ఎంపీపీ తుల శ్రీనివాస్ పోడియం ఎదుట బైఠాయించారు. రాజకీయ ఒత్తిళ్లతోనే కలెక్టర్​ఈ పని చేశారని ఆరోపిస్తూ ఆయన కూడా సభ నుంచి వాకౌట్ చేశారు.