తెలంగాణ ప్రభుత్వం కొత్తగా తీసుకొస్తున్న భూభారతి ఆర్ ఓఆర్ - 2024 చట్టం ద్వారా సాదాబైనామాలకు మోక్షం కలగనుంది. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న సాదాబైనామా దరఖాస్తులను పరిష్కరిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో సాదాకాగితంపై రాసుకుని.. రిజిస్ట్రేషన్లు చేసుకోని వారికి ఆశలు చిగురిస్తున్నాయి. భూభారతి ఆర్ఓఆర్ -2024 చట్టం ద్వారా రైతులకు ఎలాంటి లాభం జరుగుతుందో చూద్దాం..
భూసమస్యలతో రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగిన రైతుల ఇబ్బందులు తొలగనున్నాయి. త్వరితగతిన పనులు జరిగేలా ప్రభుత్వం ప్రత్యేక విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటి వరకు ఉమ్మడి నల్గొండ జిల్లాలో 25వేల 430 సాదాబైనామా దరఖాస్తులు వచ్చాయి. అందులో నల్లగొండ జిల్లాలో 13వేల 80, సూర్యాపేటలో 8వేల 564, యాదాద్రి జిల్లాలో 3వేల 786 దరఖాస్తులు రాగా.. ఫిర్యాదులపై దృష్టి సాధించారు రెవెన్యూ అధికారులు.
గ్రామీణ ప్రాంతాల్లో కొన్నేళ్ల కిందట సాదా కాగితంపై భూమి కొనుగోలు చేసి రాయించుకున్నారు రైతులు. వారిలో చాలామంది పేర్లు మార్చుకొని పట్టాలు తీసుకోలేదు. ధరణికి ముందున్న ఆర్ ఓఆర్ చట్టంలో సాదాబైనామాలతో పట్టాలు చేశారు. ధరణి వచ్చిన తర్వాత ఆ పనులు నిలిచిపోయాయి. కొంతకాలం తర్వాత వాటిని అమలు చేసేందుకు గత ప్రభుత్వం ముందుకొస్తే..ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 25వేల 430 దరఖాస్తులు వచ్చాయి. అమలులో జాప్యం, ఆ తర్వాత ఎన్నికలు రావడంతో అవి పరిష్కారానికి నోచుకోలేదు. .
ALSO READ | పెట్టుబడి తక్కువ రాబడి ఎక్కువ..సిరులు కురిపిస్తున్న బంతిపూల సాగు
గత ప్రభుత్వం 2020లో ధరణి పోర్టల్ తీసుకొచ్చి.. భూ నిర్వహణ కొనసాగించింది. ధరణిలో అన్ని రకాల ఆప్షన్లు లేకపోవడంతో రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు. ధరణిలో సాదాబైనామా దరఖాస్తులకు సంబంధించి రిజిస్ట్రేషన్ల కోసం ఆప్షన్లు లేకపోవడంతో పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. రైతులు గత ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేయగా.. చర్యలు చేపడతామని చెప్పి నిర్లక్ష్యం వహించింది. దీంతో దరఖాస్తులు చేసుకున్న రైతులు ..మూడేళ్లుగా ఎదురు చూస్తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ధరణి సమస్యలు పరిష్కరించేందుకు కొత్తగా భూభారతి ఆర్ ఓఆర్ చట్టం-2024 తీసుకొచ్చింది. ఈ బిల్లును అసెంబ్లీ, మండలి ఆమోదించింది. త్వరలోనే చట్టం అమల్లోకి రానుంది. దాంతో సాదాబైనామా సమస్య పరిష్కారం కానుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.