
- తహసీల్దార్ వద్ద పరిష్కరించకపోతే ఆర్డీవోకు..
- ఆర్డీవో వద్ద కాకుంటే కలెక్టర్‌కు..
- కలెక్టర్ తీర్పుపై అభ్యంతరాలుంటే ట్రిబ్యునల్‌కు అప్పీలు
కామారెడ్డి, వెలుగు : భూ సమస్యల పరిష్కారానికే ప్రభుత్వం ‘భూభారతి’ని తీసుకొచ్చిందని, అప్పీల్‌కు రెండంచెల వ్యవస్థ ఉందని కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. మంగళవారం భిక్కనూరు, రామారెడ్డి మండల కేంద్రాల్లో నిర్వహించిన ‘భూభారతి’ సదస్సుల్లో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. తహసీల్దార్ జారీ చేసిన మ్యుటేషన్లు, ఫాస్బుక్స్పై అభ్యంతరాలు ఉంటే ఆర్డీవోలకు అప్పీలు చేసుకోవచ్చని, ఆర్డీవోలు జారీ చేసిన తీర్పుపై అసంతృప్తిగా ఉంటే కలెక్టర్‌కు దరఖాస్తు చేయవచ్చన్నారు. కలెక్టర్ ఇచ్చిన తీర్పు అనుకూలంగా లేనిచో భూమి ట్రిబ్యునల్‌కు అప్పీలు చేసుకోవచ్చన్నారు. ఆధార్ తరహాలోనే భూధార్ కార్డులు జారీ చేస్తామన్నారు.
భూభారతి’ చట్టంలో ఏమైనా అభ్యంతరాలు , అనుమానాలు ఉంటే నివృత్తి చేసుకోవచ్చన్నారు. గతంలో ధరణిలో అప్పీలుకు అవకాశం లేనందున సివిల్ కోర్టుకు వెళ్లాల్సి వచ్చేదన్నారు. ‘భూభారతి’లో అన్ని రకాల అప్లీకేషన్లు ఉన్నాయన్నారు. పాస్‌బుక్స్‌లో భూమి మ్యాప్ ఉంటుందన్నారు. అవగాహన సదస్సుల్లో ఆర్డీవో వీణ, లైబ్రరీ జిల్లా చైర్మన్ మద్ది చంద్రకాంత్‌రెడ్డి, ఆయా మండలాల తహసీల్దార్లు, ఎంపీడీవోలు, అధికారులు పాల్గొన్నారు.
వివాదాల పరిష్కారానికే ‘భూభారతి’
బాల్కొండ, వెలుగు: భూ వివాదాల పరిష్కారానికే ‘భూభారతి' చట్టాన్ని ప్రభుత్వం తీసుకొచ్చిందని నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. మంగళవారం ముప్కాల్ లో ‘భూభారతి’పై అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. జిల్లాలోని అన్ని రెవెన్యూ గ్రామాల్లో దరఖాస్తులను స్వీకరిస్తున్నారని, నిర్ణీత కాల వ్యవధిలో పరిష్కరిస్తామన్నారు. భూ రికార్డుల్లో తప్పుల సవరణ, రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, సాదా బైనామాల క్రమబద్ధీకరణ, పట్టాదారు పాసు పుస్తకాలు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మెండోరా, బాల్కొండలో అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేశ్‌రెడ్డి, ఆర్డీవో రాజా గౌడ్ తదితరులు పాల్గొన్నారు.