భూభారతితో అనేక ప్రయోజనాలు : ఇలా త్రిపాఠి

భూభారతితో అనేక ప్రయోజనాలు  : ఇలా త్రిపాఠి
  • కలెక్టర్ ఇలా త్రిపాఠి 

నల్గొండ అర్బన్, వెలుగు : భూభారతి చట్టంతో  రైతులకు బహుళ ప్రయోజనాలు చేకూరుతాయని కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పష్టం చేశారు. ఆదివారం నల్గొండలోని దోమలపల్లి, తిప్పర్తి మండలం తిప్పర్తి రైతు వేదిక వద్ద భూభారతిపై అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ధరణిలో పరిష్కారం కాని భూ సమస్యలకు భూభారతి ద్వారా పరిష్కారం దొరుకుతుందన్నారు. ధరణిలో సవరణలు చేసేందుకు అవకాశం ఉండేది కాదని, భూభారతిలో రికార్డులను అప్ డేట్ చేసే అవకాశం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి ద్వారా రైతులు కార్యాలయం చుట్టూ తిరగాల్సిన అవసరం లేదన్నారు. ధరణిలో అనుభవదారు కాలం లేదని, భూ భారతిలో అనుభవదారులకు ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. 

భూభారతిలో భూములకు సంబంధించిన వివరాలన్నీ ఆన్​లైన్​లో నమోదవుతాయని తెలిపారు. రుణాలు కావాలంటే రైతు ఎలాంటి కాగితాలు సమర్పించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ కె.శంకర్ నాయక్ మాట్లాడుతూ రైతులకు భూభారతి ద్వారా అసైన్ భూములు, పీవోటీ భూములు, సాదాబైనామా వంటి అన్నింటికీ పరిష్కారం దొరుకుతుందన్నారు. సదస్సులో ఆర్డీవో అశోక్ రెడ్డి, తహసీల్దార్లు శ్రీనివాస్, పరశురాం, ప్రత్యేక అధికారి ఛాయాదేవి, మార్కెట్ కమిటీ చైర్మన్ రమేశ్, వైస్ చైర్మన్ వెంకన్న, మాజీ జడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య, గుమ్మల మోహన్ రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ పాశం సంపత్ రెడ్డి,  రైతులు తదితరులు పాల్గొన్నారు. 

నేటి అవగాహన సదస్సుకు మంత్రి పొంగులేటి..

ఈనెల 21న చందంపేట మండలం తమసీల్దార్ కార్యాలయం వద్ద భూభారతి చట్టంపై నిర్వహించనున్న అవగాహన సదస్సుకు రాష్ట్ర రెవెన్యూ, సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాజరుకానున్నట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ అవగాహన సదస్సుకు రైతులు పెద్ద ఎత్తున హాజరుకావాలని కోరారు.