భూ భారతి నిర్వహణలో.. రెవెన్యూ శాఖ అధికారులే కీలకం : రైతు సంక్షేమ కమిషన్  చైర్మన్  కోదండ రెడ్డి

భూ భారతి నిర్వహణలో.. రెవెన్యూ శాఖ అధికారులే కీలకం : రైతు సంక్షేమ కమిషన్  చైర్మన్  కోదండ రెడ్డి
  • తెలంగాణ వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్  చైర్మన్  కోదండ రెడ్డి

నాగర్​కర్నూల్/వంగూరు, వెలుగు: రైతుల హక్కులను హరించిన ధరణి స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన భూ భారతి చట్టం అమలులో రెవెన్యూ శాఖ అధికారులే కీలకమని తెలంగాణ వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్​ చైర్మన్​ కోదండరెడ్డి పేర్కొన్నారు. రెవెన్యూ శాఖ ప్రతిష్ట పెరిగేలా అధికారులు, సిబ్బంది మరింత జవాబుదారీతనంతో వ్యవహరించాలని కోరారు. బుధవారం నాగర్ కర్నూల్​ జిల్లా వంగూరు మండలం పోల్కంపల్లి రైతు వేదికలో భూభారతి అవగాహన సదస్సులో కమిషన్​ చైర్మన్, సభ్యులు పాల్గొన్నారు.

కొండారెడ్డిపల్లి గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం కలెక్టరేట్ లో భూ భారతి చట్టంపై రెవెన్యూ అధికారులకు నిర్వహించిన అవగాహన సదస్సులో కోదండరెడ్డి మాట్లాడారు. భూ భారతి చట్టంపై రెవెన్యూ అధికారులు అవగాహన పెంచుకోవాలని, సదస్సులను పక్కాగా నిర్వహించాలని సూచించారు.13 నెలల పాటు 18 రాష్ట్రాల్లో అమలవుతున్న రెవెన్యూ చట్టాలను పరిశీలించిన తర్వాత రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా భూభారతి చట్టం రూపొందించినట్లు తెలిపారు.

ధరణిలోని లోపాలకు భూ భారతి పరిష్కారం చూపిస్తుందన్నారు. హక్కుల రికార్డుల్లో తప్పుల సవరణ, రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, భూముల సర్వే, మ్యాప్  తయారీ, గ్రామ రెవెన్యూ రికార్డుల నిర్వహణ, సమస్యల పరిష్కారానికి రెండంచెల అప్పీల్ వ్యవస్థను పొందుపర్చామని వివరించారు. రైతాంగానికి  కొత్త చట్టంపై అవగాహన కల్పించాలని, రైతు సంఘాల నాయకులను భాగస్వామ్యం చేయాలని సూచించారు. నకిలీ బీటీ విత్తనాలు తయారు చేస్తున్న ముఠాలపై కఠినంగా వ్యవహరించాలని కలెక్టర్​ బదావత్​ సంతోష్​ను ఆదేశించారు.

రైతుల హక్కులను అమెరికా కంపెనీకి కుదవబెట్టిన తండ్రీకొడుకులు..

రాష్ట్రంలో రెవెన్యూ రికార్డులు లేకుండా నాశనం చేసేందుకు కంకణం కట్టుకున్న తండ్రీకొడుకులు(కేసీఆర్, కేటీఆర్) ధరణి నిర్వహణను అమెరికా కంపెనికీ అప్పగించారని కోదండరెడ్డి పేర్కొన్నారు. రైతుల భూములు, ఆధార్​ కార్డు, బ్యాంక్  ఖాతాల వివరాలన్నీ వారికి అప్పగించారని మండిపడ్డారు. రికార్డుల్లో పేరుండి భూమి దున్నుకుంటున్న రైతులకు హక్కులు లేకుండా చేశారని ఫైర్​ అయ్యారు. తెలంగాణలో భూములను సర్వేచేస్తామని కేంద్రం ఇచ్చిన డబ్బులను మళ్లించారని ఆరోపించారు.

తెలంగాణ రైతాంగ ప్రయోజనాలు, హక్కులను కాపాడేందుకు సీఎం రేవంత్​రెడ్డి పడిన ఆరాటం, శ్రమ వృథా కానివ్వమన్న ఆయన, భూ భారతి చట్టం అన్ని సమస్యలను పరిష్కారం చూపిస్తుందన్నారు. రైతు కమిషన్  సభ్యులు భూభారతిలోని సెక్షన్లపై  పవర్  పాయింట్  ప్రజెంటేషన్  ఇచ్చారు. ఆర్వోఆర్  తప్పుల సవరణ, సెక్షన్- 4, 5,7  గురించి, ఏ సమస్యకి ఎలా అప్పీల్  చేసుకోవాలనే అంశాలపై అవగాహన కల్పించారు. రైతు కమిషన్  సభ్యులు కేవీఎన్​ రెడ్డి, రాంగోపాల్ రెడ్డి, రాములు నాయక్, మరికంటి భవాని, కలెక్టర్​ బదావత్​ సంతోష్, అడిషనల్​ కలెక్టర్  అమరేందర్, డీఏవో చంద్రశేఖర్, ఆర్డీవోలు, తహసీల్దార్లు పాల్గొన్నారు.