
- ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య
యాదగిరిగుట్ట, వెలుగు : భూభారతి చట్టంతో రైతుల సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. సోమవారం బొమ్మలరామారంలో నిర్వహించిన భూభారతి చట్టంపై అవగాహన సదస్సులో కలెక్టర్ హనుమంతరావుతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూమి ఉన్న ప్రతి రైతులకు హక్కు కల్పించాలనే సదుద్దేశంతో ప్రభుత్వం భూభారతి చట్టాన్ని రూపొందించిందని పేర్కొన్నారు. భూసమస్యల పరిష్కారం కోసం కోర్టుల చుట్టూ తిరిగి డబ్బు, సమయం వృథా అయ్యేదే తప్ప సమస్య పరిష్కారమయ్యేది కాదన్నారు. భూభారతి చట్టంతో ఎన్నో ఏండ్లుగా పేరుకుపోయిన సమస్యలకు పరిష్కారం లభించనుందని తెలిపారు.
భూ సమస్యలు తీర్చేందుకే భూభారతి..
డిండి, వెలుగు : రైతుల భూ సమస్యలు తీర్చేందుకే ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిందని నల్గొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. డిండి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో భూభారతిపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ధరణిలో భూములకు సంబంధించి సవరణలు చేసేందుకు అవకాశం లేదని, భూభారతిలో రికార్డులను అప్ డేట్ చేసే అవకాశం ఉందన్నారు.
భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం.. -
కోదాడ, వెలుగు : భూవివాదాలకు భూభారతితో శాశ్వత పరిష్కారం దొరకుతుందని సూర్యాపేట కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. కోదాడ పట్టణంలోని ఆర్ఎస్ వీ ఫంక్షన్ హాల్, అనంతగిరి మండలం శాంతినగర్ ఎస్ డబ్ల్యూసీ గోదామలలో భూభారతి చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూభారతిపై రైతులు, ప్రజలకు అవగాన కల్పించేందుకే సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.