భూభారతితో గెట్టు పంచాయితీలకు చెక్ : ఎమ్మెల్యే సంజీవరెడ్డి

భూభారతితో గెట్టు పంచాయితీలకు చెక్ : ఎమ్మెల్యే సంజీవరెడ్డి

నారాయణ్ ఖేడ్, వెలుగు: భూభారతి చట్టం అమలుతో గెట్టు పంచాయతీలు ఉండవని ఎమ్మెల్యే సంజీవరెడ్డి, కలెక్టర్ క్రాంతి అన్నారు. మంగళవారం నియోజకవర్గంలోని కల్హేర్ లో ఏర్పాటు చేసిన భూభారతి చట్టం అవగాహన కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. భూ సమస్యలు ఉన్న రైతులు భూ భారతి పోర్టల్ లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. నిర్దిష్ట గడువులోపు  రైతుల సమస్యల్ని పరిష్కరించే అవకాశాన్ని ఆర్డీవో, కలెక్టర్లకు ప్రభుత్వం కల్పించిందన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ మాధురి,ఆర్డీవో అశోక చక్రవర్తి, రెవెన్యూ అధికారులు, డీసీసీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి, రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు.

 భూ భారతితో రైతులకు మేలు: బక్కి వెంకటయ్య

దుబ్బాక: భూ భారతితో రైతులకు మేలు జరగనుందని ఎస్సీ, ఎస్టీ కమిషన్​ చైర్మన్​ బక్కి వెంకటయ్య అన్నారు. దుబ్బాక, అక్భర్​పేట, భూంపల్లి మండల కేంద్రాల్లో ఆర్డీవో సదానందం అధ్యక్షతన జరిగిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. జిల్లా స్థాయిలో భూ రికార్డుల్లోని తప్పొప్పులను సవరణ చేసుకోవడానికి ప్రభుత్వం సువర్ణ అవకాశం కల్పించిందన్నారు.

వారసత్వంగా వచ్చే భూమి నెల రోజుల్లోగా వారసుల పేరున రికార్డుల్లో నమోదు చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. భూ విస్తీర్ణం కంటే అదనంగా రికార్డుల్లో నమోదు చేసుకున్న వారిపై ఫిర్యాదు చేసే అవకాశం భూ భారతి కల్పిస్తోందన్నారు. గ్రామ స్థాయిలో భూ సమస్యలు పరిష్కరించుకోవడానికి గ్రామ పాలనాధికారిని ప్రభుత్వం త్వరలో నియమిస్తుందన్నారు.