
- రైతులకు మేలు, ఉద్యోగులకు భరోసా
- తెలంగాణ ఉద్యోగ జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి
సిద్దిపేట రూరల్, వెలుగు: రాష్ట్రంలో కొత్తగా అమలుచేయనున్న భూ భారతి చట్టంతో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని తెలంగాణ ఉద్యోగ జేఏసీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి తెలిపారు. ఈ చట్టంతో రైతులకు మేలు జరగడంతో పాటు ఉద్యోగులకు భరోసా లభిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. శనివారం సిద్దిపేటలో తహసీల్దార్ సరిత అధ్యక్షతన ఉమ్మడి మెదక్ జిల్లా రెవెన్యూ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సభకు చీఫ్ గెస్ట్‌గా హాజరై మాట్లాడారు.
10,954 మంది జీపీవోల నియామకంతో రైతులకు మెరుగైన రెవెన్యూ సేవలు అందుతాయని, ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ సిబ్బంది, ఉద్యోగ భద్రతకు సమీప భవిష్యత్తులోనే ఓ భరోసా దొరుకుతుందన్నారు. ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని, ఈ అంశంపై త్వరలోనే ప్రభుత్వ పెద్దలు ఓ నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. ఆప్షన్ల ద్వారా రెవెన్యూ శాఖలోకి వస్తున్న జీపీవోలు సర్వీస్పరంగా అభద్రతకు గురి కావాల్సిన అవసరం లేదని, అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగుల మాదిరిగానే ప్రమోషన్లు వస్తాయన్నారు. భూ సమస్యలు లేని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు రెవెన్యూ ఉద్యోగులు పునరంకితం కావాలన్నారు.
ప్రభుత్వ సహకారంతో దేశ చరిత్రలోనే తొలిసారి 33 సెలక్షన్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ల పోస్టులను సాధించామని చెప్పారు. 61 ఏండ్లు పైబడిన వీఆర్ఏలను సర్దుబాటు చేసి ఆ కుటుంబాలకు న్యాయం చేసేలా, కారుణ్య నియామకాలు చేపట్టేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. డిప్యూటీ కలెక్టర్ల అసోసియేషన్ జనరల్ సెక్రటరీ రామకృష్ణ, టీజీఆర్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడు బాణాల రాంరెడ్డి, సంఘం ట్రెజరర్ వెంకట్ రెడ్డి, అసోసియేట్ అధ్యక్షుడు చల్ల శ్రీనివాస్, టీజీటీఏ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఎస్.రాములు, రమేశ్పాక, టీజీజీఏ జనరల్ సెక్రటరీ పూల్ సింగ్, టీజీఆర్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు బాణాల రాంరెడ్డి పాల్గొన్నారు.