
- ధరణి పేరుతో వేలాది ఎకరాలు కొల్లగొట్టినోళ్లకే దుఃఖమొస్తది: మంత్రి పొంగులేటి
- భూభారతితో రైతులు, భూస్వాములకు సమస్యలుండవు
- 18 రాష్ట్రాల్లోని రెవెన్యూ చట్టాలను స్టడీచేసి రూపొందించాం
- జూన్ 2 నుంచి అన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామని వెల్లడి
- వరంగల్, కామారెడ్డి జిల్లాల్లో భూభారతి అవగాహన సదస్సులు
వరంగల్/కరీమాబాద్/కామారెడ్డి/ఖమ్మం, వెలుగు: ధరణిని అడ్డుపెట్టుకుని వేలాది ఎకరాల పేదల భూములు కొల్లగొట్టినోళ్లు ఇప్పుడు దుఃఖం వస్తుందని రైతుల మీద కపటప్రేమ ఒలకబోస్తున్నారని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్పాలనలో తీసుకొచ్చిన భూభారతి వల్ల రైతులు, భూములున్న ఆసాములకు దుఃఖపడే పరిస్థితి రాదని, భూములు కొల్లగొట్టిన వారికే ఆ పరిస్థితి వస్తుందని ఆయన పేర్కొన్నారు. మంగళవారం వరంగల్ తో పాటు కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం శెట్పల్లిలో నిర్వహించిన భూభారతి చట్టం అవగాహన సదస్సుల్లో మంత్రి పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం నాచేపల్లిలో పలు అభివృద్ధిపనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొన్న బీఆర్ఎస్ సభలో కేసీఆర్ దుఃఖం వస్తున్నదంటూ మాట్లాడారని.. ఆయనకు ఆ దుఃఖం ఎందుకు వస్తున్నదని మంత్రి ప్రశ్నించారు. ‘‘సీఎం ఉద్యోగం పోయినందుకా? కాంగ్రెస్ ప్రభుత్వం 200 యూనిట్ల కరెంట్ ఇస్తున్నందుకా? మహిళలకు ఫ్రీ ఆర్టీసీ బస్సు ప్రయాణానికా? రాజీవ్ యువవికాసంలో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నందుకా? ప్రజలకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నందుకా? ధరణిని బంగాళఖాతంలో వేసినందుకా? ఎందుకు దుఃఖం వస్తున్నది”అని మంత్రి ప్రశ్నించారు. కేసీఆర్ సర్కారు.. ధరణి పేరుతో పదేండ్లలో విధ్వంసం సృష్టించిందన్నారు. 18 రాష్ట్రాల్లోని రెవెన్యూ చట్టాలను స్టడీచేసి.. మేధావులతో చర్చించి 100 రోజుల్లో భూభారతి చట్టం రూపొందించామని, వందేండ్ల వరకు సరిపోయేలా చట్టాన్ని తయారు చేశామని మంత్రి తెలిపారు. ప్రస్తుతం నాలుగు జిల్లాల్లో నాలుగు మండలాల్లో పైలట్ ప్రాజెక్ట్తీసుకున్నామని, ఆ తర్వాత ఒక్కో జిల్లాలో ఒక్కో మండలాన్ని మోడల్‍గా తీసుకుంటామని, జూన్ 2 నుంచి ఆగస్టు 15 వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామని చెప్పారు.
భూముల హద్దులు నిర్ధారించేందుకు రాష్ట్రంలో 6 వేల మంది ప్రైవేట్ సర్వేయర్లకు ట్రైనింగ్ ఇచ్చి లైసెన్సులు ఇస్తామన్నారు. గత పాలకుల అప్పుల వల్ల ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నా.. దానిని బాగు చేసుకుంటూ, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు. జూన్ 2న రాజీవ్ యువ వికాసం కింద యువతకు స్వయం ఉపాధి యూనిట్లు మంజూరు చేస్తామన్నారు. వరదలకు దెబ్బతిన్న రోడ్లను పూర్తి స్థాయిలో మరమ్మతులు చేశామని, గ్రామాల్లో కొత్త రోడ్లు వేస్తామని ఆయన తెలిపారు. మే 5లోగా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి లబ్ధిదారులకు శాంక్షన్లెటర్లు ఇస్తామన్నారు.
బీఆర్‍ఎస్ నేతల సంపాదన కోసమే ధరణి పోర్టల్: మంత్రి కొండా సురేఖ
కేసీఆర్ ప్రభుత్వం బీఆర్‍ఎస్ నాయకులకు భూములు కట్టబెట్టడానికే ధరణి పోర్టల్ తీసుకువచ్చిందని మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. వరంగల్ సదస్సులో ఆమె పాల్గొని మాట్లాడారు. ధరణి పోర్టల్ రాష్ట్రాన్ని, రైతులను అల్లకల్లోలం చేసిందన్నారు.
ధరణి వల్ల ఎంతమంది బాధితులు చనిపోయారో.. ఎన్నికుటుంబాలు రోడ్డున పడ్డాయో అందరికీ తెలుసన్నారు. రైతులను మోసం చేశారు కాబట్టే బీఆర్‍ఎస్ ప్రభుత్వం మట్టికొట్టుకుపోయిందన్నారు. ఆయా కార్యక్రమాల్లో వర్థన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, కలెక్టర్ సత్యశారద, గ్రేటర్ కమిషనర్ అశ్విని తానాజీ వాఖడే, జహీరాబాద్ ఎంపీ సురేశ్ షేట్కార్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే కె మదన్మోహన్రావు, కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, అడిషనల్ కలెక్టర్ విక్టర్, సబ్ కలెక్టర్ కిరణ్మయి పాల్గొన్నారు.
లబ్ధిదారుడి ఇంట్లో పొంగులేటి సన్న బియ్యం భోజనం
వరంగల్బల్దియా పరిధిలోని 32 వ డివిజన్ బీఆర్ నగర్ లో మంగళవారం సన్నబియ్యం లబ్ధిదారుడు సింగబోయిన అనిల్ కుమార్, ఎల్లమ్మ ఇంట్లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భోజనం చేశారు. ఆయనతో పాటు మంత్రి కొండ సురేఖ, ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, నగర మేయర్ గుండు సుధారాణి, వరంగల్ కలెక్టర్ సత్య శారద, బల్దియా కమిషనర్ డా.అశ్విని తానాజీ వాఖాడే కూడా సన్నబియ్యంతో వండిచన భోజనం చేశారు. లబ్ధిదారులను మంత్రులు అన్నదాత సుఖీభవ అంటూ దీవించి శాలువాలతో సత్కరించి, నజరానా అందించారు.