
- నేటి నుంచి రెవెన్యూ సదస్సులు..పైలట్ ప్రాజెక్టుగా లింగంపేట మండలం
- నోడల్ అధికారిగా అడిషనల్ కలెక్టర్ విక్టర్
- మిగతా మండలాల్లో ‘భూ భారతి’పై అవగాహన సదస్సులు
కామారెడ్డి, వెలుగు: భూ సమస్యలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర సర్కార్భూ భారతి పోర్టల్‌ను ప్రతిష్టాత్మకంగా అమలు చేయనుంది. పైలెట్ ప్రాజెక్టుగా రాష్ట్రంలో నాలుగు మండలాలను ఎంపిక చేయగా, అందులో కామారెడ్డి జిల్లాలోని లింగంపేట మండలాన్ని ఎంపిక చేసింది. నేటి నుంచి ఈ నెల 30 వరకు మండలంలోని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నారు. రికార్డుల్లో లోపాలు, నకిలీ పత్రాలు, భూ వివాదాలు తదితర సమస్యలపై దరఖాస్తులను స్వీకరించనున్నారు. తదుపరి అప్లికేషన్లను పరిశీలించి పరిష్కారం కోసం చర్యలు తీసుకోనున్నారు. మిగతా మండలాల్లో ‘భూ భారతి’ పోర్టల్ వల్ల సమస్యల పరిష్కారం, కలిగే ప్రయోజనాలపై అవగాహన సదస్సులు నిర్వహించనున్నారు. రోజుకు 2 లేదా 3 మండలాల్లో సదస్సులు నిర్వహించేలా జిల్లాయంత్రాంగం ఏర్పాట్లు చేసింది.
పరిష్కారం పక్కా..
భూ సమస్యలతో సతమతమవుతున్న యజమానులకు భూ భారతితో పక్కా పరిష్కారం లభించనున్నంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌తో అన్నదాతలు అవస్థలు పడుతున్న విషయం విధితమే. ఆన్లైన్లో భూ వివరాలు ఎంట్రీ కాకపోవడం, విస్తీర్ణంలో హెచ్చుతగ్గులు, రికార్డుల్లో తప్పులు, సర్వే నంబర్లు మిస్ కావడం, కొత్త పాస్‌బుక్ రాకపోవడం, పాస్‌బుక్‌లో పూర్తి వివరాలు ఎంట్రీ కాకపోవడం, అమ్మకాలు జరిగినా పాత యజమానుల పేర్లు ఆన్లైన్లో రావడం వంటి అనేక సమస్యలకు భూ భారతితో పరిష్కారం లభించనుంది. రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ధరిణిలోని లోటుపాట్లను సవరించడంతోపాటు కొత్త అంశాలను క్రోడీకరిస్తూ భూ సమస్యలకు స్వస్తి పలికేలా కాంగ్రెస్ సర్కార్ భూ భారతిని తీసుకొచ్చింది. ఈ నెల 14న సీఎం రేవంత్‌రెడ్డి భూ భారతిని లాంఛనంగా ప్రారంభించారు.
నేటి నుంచి లింగంపేటలో రెవెన్యూ సదస్సులు..
ఫైలెట్ ప్రాజెక్టు కింద ఎంపికైన లింగంపేట మండలంలో నేటి నుంచి 30వ తేదీ వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నారు. ఎలాంటి భూ సమస్యలు ఉన్నా రైతులు దరఖాస్తులు చేసుకోవాలని రెవెన్యూ అధికారులు సూచిస్తున్నారు. ఫారెస్టు, గవర్నమెంట్, పట్టాదారు భూముల వివాదాలు మండలంలో అధికంగా ఉన్నారు. ధరణి పోర్టల్‌లో ఎదుర్కొంటున్న సమస్యలపై దరఖాస్తు చేసుకోవచ్చు. రెవెన్యూ అధికారులు అప్లికేషన్లు స్వీకరించి పరిశీలించిన తర్వాత పరిష్కారం చూపనున్నారు. కోర్టులో కేసులు ఉన్న భూ వివాదాలను మాత్రం పక్కన పెట్టనున్నారు. నోడల్ అధికారిగా అడిషనల్ కలెక్టర్ ( రెవెన్యూ) వి.విక్టర్, మానిటరింగ్ అధికారిగా ఎల్లారెడ్డి ఆర్డీవో ప్రభాకర్ లను జిల్లా యంత్రాంగం నియమించింది.
లింగంపేట మండల సమాచారం ..
మండలంలో 23 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. మొత్తం సర్వే నంబర్లు 10,098, మొత్తం ఏరియా 61,175 ఎకరాలు ఉండగా, ఖాతాలు 21984 ఉన్నాయి. మండలంలో మొత్తం 18,142 పాసు బుక్స్ ఇష్యూ చేశారు. పాసు బుక్స్ ఇష్యూ చేసిన ఏరియా 26,272 ఎకరాలు, అసైన్డ్భూమి 12,722 ఎకరాలు, ఫారెస్ట్ భూమి 2906 ఎకరాలు ఉంది. ఫారెస్టు, రెవెన్యూ భూమి వివాదం సర్వే నబర్లు 139, ఫార్ట్ బి– కేసులు 1663 ఉన్నాయి.
ఫిర్యాదులు స్వీకరించి పరిష్కరిస్తాం ..
పైలట్ ప్రాజెక్టుగా ఎంపికైన లింగంపేట మండలంలో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నాం. భూ సమస్యలు ఉన్న వారి నుంచి ఫిర్యాదులు తీసుకొని రిజిస్ట్రర్‌లో ఎంట్రీ చేస్తాం. పరిశీలన చేసి సమస్యలు పరిష్కరిస్తాం. ఎలాంటి భూ సమస్యలు ఉన్నా పరిష్కరించాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశం. - వి.విక్టర్, అడిషనల్, కలెక్టర్
రెవెన్యూ సదస్సుల తేదీలు ఇలా..
తేదీ గ్రామం
17 పోతేపల్లి, బోనాల్
19 బాయంపల్లి, కన్నాపూర్
21 పరుమల్ల, పోల్కంపేట
22 ఎల్లారం, మెంగారం
23 రాంపూర్, జల్ధిపల్లి
24 బాణాపూర్, కొర్పోల్, లింగంపల్లి
25 భవానీపేట, ముంబాజీపేట, లింగంపేట
26 కంచమల్, కొండాపూర్
28 నల్లమడుగు, షెట్పల్లి సంగారెడ్డి
30 షెట్పల్లి, మోతె
అవగాహన సదస్సులు ఇలా..
తేదీ మండలం
17 పాల్వంచ, మాచారెడ్డి
19 ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట
21 పిట్లం, పెద్దకొడకొడప్గల్
22 రామారెడ్డి, భిక్కనూరు
23 గాంధారి, సదాశివనగర్
24 కామారెడ్డి, తాడ్వాయి, రాజంపేట
25 జుక్కల్, బిచ్కుంద
26 బీబీపేట, దోమకొండ
28 నిజాంసాగర్, మహమ్మద్‌నగర్, బాన్సువాడ
29 డొంగ్లి, మద్నూర్
30 బీర్కుర్, నస్రుల్లాబాద్