భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి భూ భారతి ఎంతో ఉపయోగం: మంత్రి పొంగులేటి

భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి భూ భారతి ఎంతో ఉపయోగం: మంత్రి పొంగులేటి

హైదరాబాద్: భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి భూ భారతి ఎంతగానో ఉపయోగపడుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం (ఏప్రిల్ 17) పూడూరు మండల కేంద్రంలోని రైతు వేదికలో భూ భారతి కొత్త ఆర్ఓఆర్ చట్టంపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్‎గా హాజరై పొంగులేటి మాట్లాడారు. రైతులకు తమ భూముల విషయంలో ఉన్న అభద్రతా భావం తొలగించి.. జవాబుదారుతనాన్ని పెంచేందుకు భూ భారతి తీసుకొచ్చామని తెలిపారు.

గత ప్రభుత్వం ధరణి పోర్టల్ తీసుకువచ్చి ప్రజా సమస్యల పరిష్కారంలో విఫలమయ్యిందన్నారు. ఇది గుర్తించిన కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు ప్రతిష్టాతక్మంగా భూభారతి-2025 చట్టాన్ని తీసుకొచ్చిందని స్పష్టం చేశారు. కొత్త చట్టం ద్వారా లావాదేవీల సేవలు, రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, నిషేధిత భూములు, ఆర్ఓఆర్ మార్పులు చేర్పులు వంటి సేవలు సులభతరం అవుతాయని తెలిపారు. 

రైతులు తమ సొంత అవసరాలు, ఆడపిల్లల పెళ్లిళ్ల ఖర్చుల నిమిత్తం వారసత్వంగా వచ్చిన భూములను అమ్ముకోవడానికి ధరణి- పోర్టల్‎తో ఎంతో ఇబ్బందికరంగా ఉండేదని.. ఇలాంటి లోటుపాట్లను గుర్తించిన ప్రభుత్వం ప్రజలకు సరళంగా అర్ధమయ్యే విధంగా భూభారతి చట్టాన్ని రూపొందించిందన్నారు. ధరణి చట్టం కారణంగా నెలల తరబడి రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగేదని అసహనం వ్యక్తం చేశారు. గతంలో  18 లక్షల ఎకరాల భూమిని, ప్రభుత్వ  స్థలాలతో పాటు వారికి నచ్చే విధంగా మార్చేసి పార్ట్- బీ పేరుతో ఎన్నో ఇబ్బందులకు గురి చేశారని మండిపడ్డారు. 

►ALSO READ | తెలంగాణకు రూ.1000కోట్ల పెట్టుబడులు..సీఎం రేవంత్రెడ్డితో జపాన్ కంపెనీ ఒప్పందం

అధికారంలోకి వస్తే ధరణిని బంగాళాఖాతంలో వేస్తామన్న మాటకు కట్టుబడి.. రైతులకు, అధికారులకు సులభంగా అర్ధం అయ్యేలా సామాన్య, గ్రామీణ ప్రజల, రైతుల సమస్యలు పరిష్కారం అయ్యేలా భూ భారతి రూపొందించామని తెలిపారు. ప్రజలు ప్రభుత్వ కార్యాలయ చుట్టూ తిరగకుండా.. గ్రామాల్లోకే ప్రజలు దగ్గరకు అధికారులు వచ్చి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని చెప్పారు.
భూ సమస్యల పరిష్కారానికి రోజుకు రెండు మండలాల చొప్పున అధికారులు పర్యటించి భూ భారతి చట్టంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు.