ప్రజాస్వామ్య సమగ్రత పరిరక్షణకు చర్యలు తీసుకోండి .. స్పీకర్ ఓం బిర్లాకు ఎంపీ చామల లేఖ

ప్రజాస్వామ్య సమగ్రత పరిరక్షణకు చర్యలు తీసుకోండి .. స్పీకర్ ఓం బిర్లాకు ఎంపీ చామల లేఖ

న్యూఢిల్లీ, వెలుగు: పార్లమెంటరీ ప్రజాస్వామ్య సమగ్రతను పరిరక్షించేందుకు తక్షణ చర్యలు అవసరమని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. పార్లమెంటరీ న్యాయం, పారదర్శకత, ప్రమాణాలను పునరుద్ధరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు ఎంపీ చామల లేఖ రాశారు. ఈ లేఖలో మొత్తం 12 అంశాలను స్పీకర్ దృష్టికి తీసుకెళ్లారు. రాజ్యాంగం నిబంధనల ప్రకారం లోక్ సభలో డిప్యూటీ స్పీకర్ ఎన్నిక చేపట్టాల్సి ఉందన్నారు. కానీ 2019 నుండి లోక్ సభలో డిప్యూటీ స్పీకర్ పదవి ఖాళీగా ఉందని, ఇది రాజ్యాంగ విరుద్ధమన్నారు.

 లోక్ సభ ప్రతిపక్ష నేత మాట్లాడ దల్చినప్పుడు అవకాశం ఇవ్వడం సంప్రదాయం అన్నారు. కానీ ఈ విషయాన్ని విస్మరించడం సరికాదని పేర్కొన్నారు. విపక్ష ఎంపీలు పాయింట్ ఆఫ్ ఆర్డర్ తీసుకురాగానే వారి మైక్రోఫోన్లు ఆఫ్ చేయడం సభలో నిత్యకృత్యంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. కానీ అధికార పార్టీ ఎంపీలు మాత్రం స్వేచ్ఛగా మాట్లాడే అవకాశాన్ని పొందుతున్నారన్నారు. ఇది ప్రతిపక్షాల గొంతు నొక్కడమే అవుతుందని ఆరోపించారు. 

ఇక బీఏసీ మీటింగ్​లో ప్రతి పక్షాలను సంప్రదించకుండా, ఎలాంటి సమాచారం ఇవ్వకుండ నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలు స్వతంత్రంగా పనిచేయనివ్వాలని, స్పీకర్ ఆఫీస్ కమిటీ నివేదికల్లో సవరణలు సూచించడాన్ని తప్పుబట్టారు. జీరో అవర్ లో చర్చకు అనుమతించే వాయిదా తీర్మానాలను తక్షణమే తిరస్కరిస్తున్నారని ఫైర్ అయ్యారు. ఇది అత్యవసరమైన జాతీయ సమస్యలను ప్రస్తావించే ఎంపీల హక్కులను పరిమితం చేస్తోందన్నారు. ఈ అంశంపై 27న ప్రతిపక్ష పార్టీ ఎంపీలం లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను కలిశామని పేర్కొన్నారు. ఈ అంశాలపై స్పీకర్ జోక్యం చేసుకొని చర్యలు చేపట్టాలని సూచించారు.