అట్టహాసంగా భూభారతి ప్రారంభం .. సదస్సుకు హాజరైన మంత్రి పొంగులేటి

అట్టహాసంగా భూభారతి ప్రారంభం .. సదస్సుకు హాజరైన  మంత్రి పొంగులేటి
  • రైతుల నుంచి స్వయంగా వినతుల స్వీకరణ
  • ధరణితో పడిన తిప్పలు సభలో చెప్పుకున్న రైతులు

మద్దూరు, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భూభారతి చట్టం–2025 ప్రారంభమైంది. నారాయణపేట జిల్లా మద్దూరు మండలాన్ని పైలెట్​ ప్రాజెక్టు కింద ఎంపిక చేయగా.. మండలంలోని ఖాజీపూర్​ గ్రామంలో గురువారం ఉదయం చట్టం గురించి ప్రజలు, రైతులకు అవగాహన కల్పించేందుకు స్థానిక మల్లికార్జున స్వామి ఆలయ ఆవరణలో రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి చీఫ్​ గెస్ట్​గా హాజరయ్యారు. కలెక్టర్​ సిక్తా పట్నాయక్, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు మంత్రికి స్వాగతం పలికారు. 

ముందుగా అంబేద్కర్​ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం డప్పు వాయిద్యాల మధ్య భారీ ర్యాలీగా సదస్సుకు వచ్చారు. పలువురు రైతుల నుంచి మంత్రి స్వయంగా భూ సమస్యలపై అప్లికేషన్లు తీసుకున్నారు. త్వరలో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అంతకుముందు కలెక్టర్​ సిక్తా పట్నాయక్​ మాట్లాడుతూ ప్రభుత్వం భూ పరిపాలనలో కొత్త అధ్యయనానికి శ్రీకారం చుట్టిందన్నారు. ధరణి స్థానంలో భూభారతి పోర్టల్​ను ప్రారంభించిందన్నారు. నారాయణపేట జిల్లా మద్దూరు మండలాన్ని పైలెట్ ప్రాజెక్ట్​ కింద ఎంపి చేసిందని, ఈ పోర్టల్​ను ఆఫీసర్ల సహకారంతో విజయవంతంగా నిర్వహిస్తామన్నారు. 

సీఎం మానస పుత్రిక భూ భారతి..

సీఎం రేవంత్​ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి మానస పుత్రిక భూభారతి పోర్టల్ అని మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. గత బీఆర్ఎస్  ప్రభుత్వం ధరణి పేరుతో రైతుల భూములను పార్ట్-బీలో పెట్టి.. ఆ పార్టీ లీడర్లు లక్షల్లో గుంజేలా చేసిందన్నారు. భూభారతిలోని సెక్షన్ 5, 7,8తో 80 శాతం భూ సమస్యలు తీరుతాయన్నారు. 

భూభారతితోనే రైతులకు న్యాయం..

భూ భారతి చట్టంతో రైతులకు లబ్ధి చేకూరుతుందని నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్నికా రెడ్డి తెలిపారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ పోర్టల్​పైనే ప్రజలు చర్చించుకుంటున్నారన్నారు. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ధరణిని బంగాళాఖాతంలో వేస్తాం.. కాంగ్రెస్​ను గెలిపించండని ఆ రోజు మాట ఇచ్చిన రేవంత్ రెడ్డిని తెలంగాణ ప్రజలు గెలిపించి సీఎంను చేశారన్నారు. ఈ రోజు భూభారతి పోర్టల్​తో సీఎం ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడన్నారు. బాలల హక్కుల కమిషన్ చైర్ పర్సన్  సీతాదయాకర్ రెడ్డి, లైబ్రరీ చైర్మన్  వార్ల విజయ్ కుమార్, కొడంగల్  నియోజకవర్గ కాంగ్రెస్  ఇన్​చార్జి ఎనుముల తిరుపతి రెడ్డి, భూభారతి ప్రత్యేక అధికారి యాదగిరి, రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్​ సెక్రటరీ బుద్ద ప్రకాశ్, ఎస్పీ యోగేష్ గౌతమ్, అడిషనల్​ కలెక్టర్  బెన్ షాలమ్, కుడా స్పెషల్​ ఆఫీసర్​ వెంకట్ రెడ్డి, న్యాయవాది భూమి సునీల్, ఆర్డీవో రాంచందర్ నాయక్, నారాయణపేట డీసీసీ అధ్యక్షుడు ప్రశాంత్ రెడ్డి, మద్దూరు పీఏసీఎస్​ చైర్మన్ నర్సింలు పాల్గొన్నారు.

విరాసత్​ చేయడానికి రెండేండ్లుగా తిప్పుతున్నరు..

గ్రామ శివారులో ఉన్న ఎకరం భూమి మా నాన్న పేరు మీద ఉంది. ఆయన పేరు నుంచి నా పేరు మీదకు విరాసత్​ చేయాలని రెండేండ్లుగా రెవెన్యూ ఆఫీసు చుట్టూ తిరుగుతున్నా. ఇంత వరకు విరాసత్​ చేస్తలేరు. అసలు సమస్య ఏందని అడిగితే కూడా ఆఫీసర్లు సమాధానం చెప్పడం లేదు. భూభారతితో అయినా విరాసత్​ అవుతుందని ఆశిస్తున్నా.

ఎండీ రహీం, ఖాజీపూర్

ఎస్సీల భూమి పెద్దల పేరున చేశారు..

గ్రామంలోని కొందరు ఎస్సీలకు సర్వే నంబర్​ 117లో 11 ఎకరాలకు పైగా భూమి ఉంది. ఐదేండ్ల కింద ఈ భూమిని పెద్దల పేరు మీదకు మార్చారు. ఇప్పటి వరకు ఆ సమస్య పరిష్కారం కాలేదు. వేలు ఖర్చు పెట్టుకొని పేద ఎస్సీలు ఆఫీసర్ల చుట్టూ తిరిగినా పని చేయలేదు. భూభారతితో ఈ సమస్య తీరుతుందని అనుకుంటున్నా.

కర్రె వీరారెడ్డి, మాజీ సర్పంచ్, ఖాజీపూర్