భూ సమస్యలు లేని తెలంగాణ..గ్రామ పాలనాధికారులదే బాధ్యత

భూ సమస్యలు లేని తెలంగాణ..గ్రామ పాలనాధికారులదే బాధ్యత

గెట్టు పంచాయతీ లేని తెలంగాణ ఏర్పాటు చేస్తామని గత ప్రభుత్వం 2017లో LRUP (ల్యాండ్ రికార్డ్ అప్డేట్ ప్రోగ్రాం)తో రికార్డుల ప్రక్షాళన మొదలు పెట్టి ఒకవైపు రెవెన్యూ ఉద్యోగులు అద్భుతంగా పనిచేశారు అని ప్రోత్సాహకాలు ఇస్తూ , ఇంకోవైపు భూముల పట్టా మార్పిడిలో ముఖ్యమంత్రికి లేని అధికారం వీఆర్వోలకు ఉన్నదని, వారికి అవినీతిపరులు అనే ముద్ర వేస్తూ ధర్మగంట మోగించారు. 

2020 కొత్త రెవెన్యూ చట్టం ద్వారా వీఆర్వో వ్యవస్థను రద్దు చేసి వివిధ డిపార్ట్​మెంట్లలో సర్వీసు రూల్స్​కు విరుద్ధంగా సర్దుబాటు చేసి గ్రామాలలో ప్రజలకు రెవెన్యూ వ్యవస్థను దూరం చేశారు. ధరణి పోర్టల్ కాంట్రాక్టు NIC లాంటి ప్రభుత్వరంగ సంస్థలకు ఇవ్వకుండా ప్రైవేటు కంపెనీల చేతిలో పెట్టారు.  

కంప్యూటర్లో చెత్త నింపితే తిరిగి అది చెత్తే ఇస్తుంది  అనేవిధంగా  పోర్టల్ 33 మాడ్యూల్స్ తయారు చేశారు. కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడినట్టు.. ఉన్న సమస్యలు పరిష్కారం కాకుండా కొత్త సమస్యలు తెచ్చిపెట్టారు. ‘సమగ్ర భూ సర్వే’ చేసి గెట్టు పంచాయతీ లేని తెలంగాణ నిర్మిస్తాం అని చెప్పి పథకాన్ని అటకెక్కించారు. గ్రామకంఠం భూముల సర్వే చేసి పట్టాలు ఇచ్చే కేంద్ర ప్రభుత్వ ‘స్వామిత్వ పథకం’ అమలు చేయలేదు.

భూ భారతి చట్టం–2024 

ప్రస్తుత ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ధరణి పోర్టల్ బంగాళాఖాతంలో కలిపి, భూ భారతి చట్టం–2024ను ఆమోదించింది. ధరణి పోర్టల్ కాంట్రాక్టును ప్రభుత్వరంగ సంస్థ NICకి అప్పజెప్పింది. ఐదు మాడ్యూల్స్ తో భూ భారతి  పోర్టల్ ఉగాది రోజున ప్రారంభం చేయబోతున్నది. 

గ్రామాలలో ప్రజలకు దూరమైన రెవెన్యూ వ్యవస్థను దగ్గర చేసేలా 10,954 రెవెన్యూ గ్రామాలలో గ్రామ పాలన అధికారుల నియామకానికి ఉత్తర్వులు జారీచేసింది. చట్టం రూపొందించగానే గొప్ప కాదు.  దాని అమలుకు విధి విధానాల రూపకల్పన చాలా ముఖ్యం. గత  ప్రభుత్వం చట్టం చేసి ఎలాంటి నియమాలు రూపొందించకుండా కేవలం జిల్లా కలెక్టర్, సీసీఎల్ఏలకు మాత్రమే పట్టా ఎడిట్ అధికారాలు ఇచ్చి నాలుగేళ్లు ప్రజల చెప్పులు అరిగేలా ఆఫీసుల చుట్టూ తిరిగినా సమస్య పరిష్కారం చేయలేదు. ప్రస్తుతం చాలా పకడ్బందీగా భూ భారతి చట్టం అమలు కోసం ప్రభుత్వం రూల్స్ తయారు చేస్తున్నది.

గ్రామపాలన అధికారులు (జీపీవో) 

ప్రస్తుతం గ్రామాల్లో ప్రభుత్వం నియమించబోయే గ్రామ పాలన అధికారులపై పెద్ద బాధ్యతే ఉన్నది. గ్రామాల్లో అనేక భూసమస్యలు ఉన్నాయి. అపరిష్కారంగా ఉన్న 10 లక్షల సాదా బైనామాలు,  ఎప్పుడో కట్టుకున్న బీడీ కార్మికుల ఇండ్లు వేరొకరి పేరున ధరణి పట్టా పాస్ బుక్స్, నాలా కన్వర్షన్ చేయకుండా ఏర్పాటు చేసిన గ్రామ పంచాయతీ లేఔట్స్​కు ధరణిలో అగ్రికల్చర్ పట్టాలు, చెరువులు, కుంటల పరిరక్షణ, ప్రభుత్వ భూములు, ఎవాక్యు & ఎండోమెంట్ భూముల పరిరక్షణ ఆపైన భూ భారతి చట్టం అమలులో భూ రికార్డుల భద్రత, గ్రామకంఠం, ఆబాది భూముల సర్వే, వ్యవసాయ భూముల సమగ్ర భూ సర్వేలాంటి బాధ్యతలు ఉన్నాయి. 

గత ప్రభుత్వం వీఆర్వోలు అవినీతిపరులు అని వేసిన ముద్రను చేరిపేసుకోవడానికి..అసలు అవినీతిపరులు ఎవరో తేల్చడానికి  గ్రామ పాలన అధికారులకు ఇదొక చక్కటి అవకాశంగా చెప్పుకోవచ్చు. భూభారతి చట్టాన్ని రైతులకు చుట్టంగా మార్చి భూ సమస్యలు లేని తెలంగాణ నిర్మాణం కిందిస్థాయిలో గ్రామ పాలన అధికారులదే.

- బందెల సురేందర్ రెడ్డి, మాజీ సైనికుడు-