ధరణి ఇక భూభారతి.. ప్రతి కమతానికి భూధార్ నంబర్

ధరణి ఇక భూభారతి.. ప్రతి కమతానికి భూధార్ నంబర్
  • ప్రతి కమతానికి భూధార్ నంబర్
  • ఆబాదీ భూములకు కూడా..
  • ధరణి ఇక భూభారతి
  • ఆన్​లైన్​లో పహాణీలు
  • భూసమస్యల పరిష్కారానికి అప్పీలేట్స్​
  • పెండింగ్ సాదా బైనామాలకూ పరిష్కారం
  • నేడు అసెంబ్లీలో ఆర్​ఓఆర్ డ్రాఫ్ట్​!

హైదరాబాద్, వెలుగు: ‘ధరణి’ పోర్టల్ ఇక ‘భూ భారతి’గా మారనుంది. అలాగే ప్రతి కమతానికి ఒక భూధార్ నంబర్‎ను జీయో రిఫరెన్సింగ్ ఇవ్వనున్నారు. తొలుత టెంపరరీ.. ఆ తరువాత పర్మినెంట్ భూధార్ నంబర్ కేటాయించనున్నారు. ఈ మేరకు బుధవారం అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేయనున్నట్లు తెలిసింది. ప్రైవేట్ ఏజెన్సీ టెర్రాసిస్​ఆధ్వర్యంలో కొనసాగుతున్న ధరణి పోర్టల్​ నిర్వహణను కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్ఐసీకి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే అప్పగించింది. ధరణి స్థానంలో భూమాతను తెస్తామని మేనిఫెస్టోలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది.

కానీ భూమాత పేరు ఇప్పటికే పలు రాష్ట్రాల్లో వాడుకలో ఉండటంతో..  భూ భారతిగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. దీంతోపాటు కీలకమైన కొత్త ఆర్ఓఆర్– 2024 బిల్లును కూడా అసెంబ్లీలోకి బుధవారం తీసుకురానుంది. దీంతో గత కొన్నేండ్లుగా భూ సమస్యలకు అప్పీళ్లు లేక కోర్టులకు వెళ్తున్న రైతులకు ఇక పరిష్కార మార్గం దొరకనుంది. ఈ మేరకు కొత్త ఆర్​ఓఆర్ చట్టంలో అప్పిలేట్ వ్యవస్థను ప్రభుత్వం తీసుకువస్తున్నది. మాన్యువల్​గా, ఆన్​లైన్​లో పహాణీల నిర్వహణ చేపట్టనున్నారు. దాదాపు 12–14 కాలమ్స్​తో రికార్డుల నిర్వహణ ఉంటుందని తెలుస్తుంది.

కోర్టు బాధలకు చెక్

ఇక ఇప్పుడున్న ఆర్​ఓఆర్ చట్టం ప్రకారం ఒక భూసమస్య రిజెక్ట్ అయితే కోర్టుకు వెళ్లి ఆర్డర్ తెచ్చుకోవడం తప్ప ఇంకో మార్గం లేకుండా పోయింది. ఇలా భూముల సమస్యలపై దాదాపు 3 లక్షల దాకా అన్ని స్థాయి కోర్టుల్లో కేసులు నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు. నెలలు, ఏండ్ల తరబడి ఆర్డర్ కోసం ఎదురుచూడటం, కోర్టు ఫీజులు, అడ్వకేట్ ఫీజులకు వేలల్లో, లక్షల్లో ఖర్చుపెట్టుకోవడం పేద రైతులకు ఇబ్బందికరంగా మారింది. గత ప్రభుత్వం చేసిన తప్పులకు తాము బలవుతున్నామని ఎన్నోసార్లు ఆందోళనకు దిగారు. 

ఇప్పుడు ఈ సమస్యకు చెక్ పెట్టేలా కొత్త ఆర్​ఓఆర్ ముసాయిదాలో ప్రభుత్వం అప్పిలేట్స్ పెట్టింది. తహసీల్దార్లు, ఆర్డీవోలు చేసే రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లకు సంబంధించి వివాదాలు వస్తే అప్పీల్, రివిజన్‌‌‌‌కు ఈ చట్టం అవకాశం కల్పిస్తుంది. తహసీల్దార్లు, ఆర్డీవోలు తీసుకునే నిర్ణయాలపై అప్పీల్‌‌‌‌ను కలెక్టర్లు లేదా అడిషనల్‌‌‌‌ కలెక్టర్లకు చేసుకోవచ్చు. ఆ తర్వాత సెకండ్‌‌‌‌ అప్పీల్‌‌‌‌కు కూడా వెళ్లే వెసులుబాటు కల్పించారు. అయితే, సెకండ్‌‌‌‌ అప్పీల్‌‌‌‌ మాత్రం సీసీఎల్‌‌‌‌ఏకు చేసుకోవాల్సి ఉంటుంది.

 అవసరం అనుకుంటే అప్పిలేట్స్​ను కలెక్టర్ వరకే పరిమితం చేసే రెండో ప్రతిపాదన కూడా ప్రభుత్వం పెట్టుకున్నది. ఈ అప్పీల్‌‌‌‌ నిబంధనలు పాత చట్టంలో లేవు. ఇక, రివిజన్‌‌‌‌ రాష్ట్ర ప్రభుత్వం లేదా సీసీఎల్‌‌‌‌ఏ మాత్రమే చేయాలని బిల్లులో పొందుపరిచారు. గతంలో జేసీకి ఉన్న రివిజన్‌‌‌‌ అధికారాలను ఇప్పుడు సీసీఎల్‌‌‌‌ఏకి ఇచ్చారు. ఏదైనా రికార్డులో తప్పు జరిగిందని భావిస్తే సుమోటోగా తీసుకుని కూడా పరిష్కరించవచ్చు. 


అయితే, అడిషనల్‌‌‌‌ కలెక్టర్‌‌‌‌ స్థాయి నుంచి ప్రభుత్వం వరకు అప్పీల్‌‌‌‌ లేదా రివిజన్లలో ఏ నిర్ణయం తీసుకున్నా లిఖితపూర్వక ఆదేశాలు ఇవ్వడాన్ని తప్పనిసరి చేశారు. 2020 చట్టంలో ఈ అంశం లేదని, కొత్త చట్టం అమల్లోకి వస్తే భూమి హక్కుల రికార్డుల వివాదాలన్నీ అప్పీలు, రివిజన్లతోనే పరిష్కారమవుతాయని రెవెన్యూ వర్గాలంటున్నాయి. అయితే, యాజమాన్య హక్కుల వివాదాలు, భాగపంపకాల విషయంలో వివాదాలున్నప్పుడు మాత్రమే కోర్టులకు వెళ్లే వెసులుబాటు ఇచ్చారు.

 

బిల్లులోని కొన్ని ముఖ్యాంశాలు

 

భూమి హక్కుల బదలాయింపు కోసం 18 రకాల పద్ధతులను గుర్తించి, ఈ 18 పద్ధతుల్లో ఏ రకంగా హక్కుల బదలాయింపు జరిగినా రికార్డ్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ రైట్స్‌‌‌‌ (ఆర్‌‌‌‌వోఆర్‌‌‌‌)లో నమోదు చేయాలి. రిజిస్టర్‌‌‌‌ దస్తావేజులు, వారసత్వం, భాగపంపకాల ద్వారా హక్కుల బదలాయింపునకు పాత చట్టంలోని నిబంధనను కొనసాగించారు. ఈ పద్ధతుల్లో తహసీల్దారే రిజిస్ట్రేషన్, మ్యుటేషన్‌‌‌‌ చేస్తారు. అయితే, మ్యుటేషన్‌‌‌‌ చేసే సమయంలో విచారణ చేసే వెసులుబాటు చట్టంలో కల్పించారు. 

ఈ విచారణలో తప్పు జరిగిందని తేలితే మ్యుటేషన్‌‌‌‌ నిలుపుదల చేసే నిబంధన పెట్టారు. ఇది ప్రస్తుతం ఉన్న చట్టంలో లేదు. ఒకవేళ తప్పు జరిగినట్టు నిర్ధారణ జరిగితే కారణాలు వివరిస్తూ మ్యుటేషన్‌‌‌‌ను ఆపేయవచ్చని కొత్త చట్టం చెబుతోంది. రిజిస్టర్డ్‌‌‌‌ దస్తావేజులు, భాగపంపకాలు, వారసత్వ హక్కుల మ్యుటేషన్‌‌‌‌ను విచారించే అధికారం తహసీల్దార్లకు, మిగిలిన సందర్భాల్లో రిజిస్ట్రేషన్‌‌‌‌ చేయాల్సి వచ్చినప్పుడు మ్యుటేషన్‌‌‌‌ చేసే అధికారం ఆర్డీవోకు ఇచ్చారు.
     
రిజిస్ట్రేషన్, మ్యుటేషన్‌‌‌‌ చేసేటప్పుడు సర్వే మ్యాప్‌‌‌‌ తప్పనిసరి చేశారు. రిజిస్ట్రేషన్‌‌‌‌కు వెళ్లే వారు ఈ మ్యాప్‌‌‌‌ను తీసుకెళ్లాల్సి ఉంటుంది. భవిష్యత్తు వివాదాలకు చెక్‌‌‌‌ పెట్టే విధంగా గతంలో లేని ఈ కొత్త నిబంధన పెట్టారు. అయితే, ప్రభుత్వం నిర్దేశించిన తేదీ తర్వాత (ఇందుకు అవసరమైన వ్యవస్థను తయారు చేసుకున్న తర్వాత) మాత్రమే ఈ మ్యాప్‌‌‌‌ తప్పనిసరి అవుతుందని బిల్లులో పొందుపరిచారు.
     
గతంలో ప్రభుత్వం తీసుకున్న సాదాబైనామా దరఖాస్తులను కొత్త చట్టం కింద చేసుకున్న దరఖాస్తులుగానే పరిగణించాలి. తద్వారా సాదాబైనామాల కోసం ఇప్పటికే పెండింగ్‌‌‌‌లో ఉన్న 9.4లక్షల దరఖాస్తులు మళ్లీ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఈ పరిష్కార సమయంలో స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్‌‌‌‌ ఫీజు కూడా కట్టాల్సిన అవసరం లేదు. అయితే, కొత్తగా మళ్లీ సాదాబైనామాల దరఖాస్తులను తీసుకుని పరిష్కరించే అధికారం ఈ బిల్లులో పొందుపరిచారు. అది కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటనే ఇవ్వనున్నారు. సాదాబైనామాలను పరిష్కరించే అధికారం గతంలో కలెక్టర్లకు ఉండగా, ఈ చట్టం ద్వారా ఆర్డీవోలకు సాదాబైనామాల పరిష్కారం అధికారాలిచ్చారు.