సిద్దిపేట, వెలుగు: యాభై ఏండ్ల క్రితం గజ్వేల్ కు చెందిన ఇద్దరు భూస్వాములు భూదానోద్యమంలో భాగంగా గజ్వేల్, సంగుపల్లి, ధర్మారెడ్డిపల్లి రెవెన్యూ గ్రామ పరిధిలో దాదాపు 250 ఎకరాలను ప్రభుత్వానికి అప్పగించారు. తర్వాత ఈ భూములను ప్రభుత్వం పేద రైతులకు పంపిణీ చేయడంతో వారంతా సాగు చేసుకుంటున్నారు. కొద్ది సంవత్సరాల క్రితం వరకు రెవెన్యూ రికార్డుల్లో కబ్జాదారు కాలంలో రైతుల పేర్లు ఉండేవి. ధరణి పోర్టల్ ప్రారంభం నాటి నుంచి కబ్జాదారు(ఖాస్తు) కాలమ్తీసివేయడంతో ఆ భూములన్నీ అసైన్డ్ గా మారిపోయాయి. ఐదు దశాబ్దాలకు పైగా రెవెన్యూ రికార్డుల్లో కబ్జా(ఖాస్తు) కాలమ్లో ఉన్న తమ పేర్లు ధరణి కారణంగా మాయమవడంతో కొంతకాలంగా రైతులు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ఇటీవల గజ్వేల్ ఆర్డీఓ భూదాన్ భూముల్లో సాగు చేసుకుంటున్న రైతులను పిలిపించి 180 ఎకరాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని చెప్పడంతో వారిలో ఆందోళన మొదలైంది.
ఓపెన్ ప్లాట్ల కోసం పంట భూములు
గజ్వేల్ మండల పరిధిలోని సంగుపల్లి గ్రామానికి చెందిన దాదాపు వంద మంది రైతులు 180 ఎకరాల భూదాన్ భూముల్లో సాగు చేసుకుంటున్నారు. గజ్వేల్ రెవెన్యూ పరిధిలోని 796 సర్వే నంబరు నుంచి 710 సర్వే నంబరు వరకు మొత్తం 200 ఎకరాలకు పైగా భూదాన్ భూములున్నాయి. వీటిలోంచి సంగుపల్లి రైతులకు చెందిన 180 ఎకరాలను సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ఈ భూముల్లోంచి రింగ్ రోడ్డు, రైల్వే లైన్, ఇరిగేషన్ కాల్వలు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం కొంత సేకరించారు. ప్రభుత్వం గతంలో సేకరించిన భూదాన్ భూములకు పరిహారం ఇచ్చినా మార్కెట్ రేట్లతో పొలిస్తే భారీగా తేడాలున్నాయి.
మల్లన్న సాగర్ నిర్వాసితులకు ఓపెన్ ప్లాట్ల కేటాయింపుతో పాటు ఇతర అభివృద్ధి పనులకు ఈ భూములను ప్రభుత్వం వాడుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే సాగు చేసుకుంటున్న పచ్చని పంట పొలాల్ని ప్రభుత్వం సేకరించాలనుకోవడంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై ఇటీవల జిల్లా కలెక్టర్ కు సంగుపల్లి రైతులు వినతిపత్రం సమర్పించి భూములు సేకరించి అన్యాయం చేయవద్దని కోరారు. ప్రభుత్వం సేకరించాలనుకుంటున్న సంగుపల్లి గ్రామ పరిధిలోని భూములు ఎకరానికి రూ. 3 కోట్ల దాకా పలుకుతోంది. ఇంతటి విలువైన భూములను ప్రభుత్వానికి నామమాత్రం పరిహారానికి ఇచ్చేందుకు రైతులు అంగీకరించడం లేదు. ఈ భూముల్లో పంటల సాగు కోసం పలువురు రైతులు బోర్లతో పాటు డ్రిప్ ఇరిగేషన్ సైతం ఏర్పాటు చేసుకున్నారు. పంటల సాగుకు అనువైన భూములను ఇతర పనులకు సేకరించడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్న రైతుల నుంచి వస్తోంది.
పేద రైతులకు అన్యాయం చేయద్దు
భూదాన్ భూముల్లో సాగు చేసుకుం టున్న పేద రైతులకు ప్రభుత్వం అన్యాయం చేయవద్దు. నాలుగు తరాలుగా భూమిని సాగు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటుంటే ఇప్పుడు అధికారులు వచ్చి తీసుకుంటామని అనడం ఎంతవరకు న్యాయం. సంగుపల్లిలో ఎక్కువమంది పేద దళిత రైతులే భూదాన్ భూముల్ని సాగు చేసుకుంటున్నారు. దళితులకు మూడెకరాల భూమిని ఇవ్వడం మరచిపోయిన సర్కారు మా భూములను మాత్రం లాక్కుంటోంది.
- కిచ్చిగారి యాదగిరి, రైతు, సంగుపల్లి
ప్రభుత్వ అవసరాలకు..
భవిష్యత్ ప్రభుత్వ అవసరాల కోసం సంగుపల్లి వద్ద 180 ఎకరాలను సేకరించాలని నిర్ణయించి రైతులకు తెలియజే శాం. అవి భూదాన్ భూములైనప్పటికీ అసైన్డ్ భూములుగానే గుర్తిస్తున్నాం. సేకరించిన భూముల పరిహారంపై రైతులతో చర్చిస్తాం. ఈ భూముల్లో చాలావరకు క్రయ విక్రయాలు జరిగి చేతులు మారినట్టుగా సమాచారం ఉంది. రైతులు అంగీకరించకుంటే పీవోటీ కింద భూమిని సేకరిస్తాం.
- విజయేందర్ రెడ్డి, ఆర్డీఓ, గజ్వేల్