- ఇష్టారాజ్యంగా అమ్మకాలు, మట్టి తవ్వకాలు
- 150 ఎకరాలను ఆక్రమించిన రెండు కంపెనీలు
- భూములు ఖాళీ చేయాలని లోకాయుక్త తీర్పు
- పట్టించుకోని యాజమాన్యాలు, ఆఫీసర్లు
- తవ్వకాలు అడ్డుకుంటే చంపుతామంటూ ఫోన్ కాల్స్
సూర్యాపేట, వెలుగు : సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో కోట్ల రూపాయల విలువైన భూదాన్ భూములు కబ్జాకు గురవుతున్నాయి. ఈ భూముల్లో నిర్మాణాలు చేపట్టమే కాకుండా మట్టిని అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. కబ్జా, అక్రమ మట్టి దందాను అడ్డుకోవాల్సిన ఆఫీసర్లు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.
రెండు కంపెనీల చేతుల్లో 150 ఎకరాలు
మేళ్లచెరువులో 150 ఎకరాల భూదాన్ భూములు ఉన్నాయి. వీటి విలువ ప్రస్తుతం రూ. 75 కోట్లపైనే ఉంటుంది. మొత్తం భూమిలో 113 ఎకరాలను ఓ సిమెంట్ కంపెనీ యాజమాన్యం కబ్జా చేసి భారీ నిర్మాణాలు చేపడుతోంది. మరో 40 ఎకరాలను మరో కంపెనీ ఆక్రమించి అమ్మకాలు, మట్టి తవ్వకాలు చేస్తున్నారు. భూదాన్ భూముల నుంచి సిమెంట్ కంపెనీలు ఖాళీ చేయాలని గతంలోనే లోకాయుక్త తీర్పు ఇచ్చింది. కానీ కంపెనీల ఓనర్లు మాత్రం ఆ ఆర్డర్స్‌ను పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఆఫీసర్లు సైతం కంపెనీలకే వత్తాసు పలుకుతుండడంతో ఆ భూముల్లో భారీ నిర్మాణాలు, మట్టి తవ్వకాలు చేపడుతున్నారు. పదుల సంఖ్యలో ట్రాక్టర్లు, టిప్పర్లు, జేసీబీలతో రాత్రింబవళ్లు మట్టిని తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. కంపెనీలపై ఇటీవల క్రిమినల్, సివిల్ కేసులు నమోదు కావడంతో కొంతమంది బినామీలను సృష్టించి అక్రమాలకు పాల్పడుతున్నారు.
అడ్డుకుంటే ఫోన్‌లో బెదిరింపులు
భూదాన్ భూముల్లో మట్టి మాఫియా, అక్రమ నిర్మాణాలకు స్థానిక లీడర్ల నుంచి సపోర్ట్ లభిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ అక్రమాలను అడ్డుకునేందుకు ఎవరైనా ప్రయత్నం చేస్తే వారికి ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు. మేళ్లచెరువుకు చెందిన ఓ ప్రజాప్రతినిధి భర్త కొందరిని ఫోన్‌లో బెదిరించిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘భూదాన్ భూములను కొనుగోలు చేశాను, మట్టి తవ్వకాలను అడ్డుకుంటే చంపుతా’ అని సదరు ప్రజాప్రతినిధి భర్త బెదిరిస్తున్నాడని, స్థానికులపై దాడులకు పాల్పడుతున్నారని కొందరు వ్యక్తులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.
కేసులు నమోదు చేస్తాం
భూదాన్ భూముల్లో మట్టి తవ్వితే కేసులు నమోదు చేస్తాం. అక్రమాలకు పాల్పడుతున్న పలువురిని గతంలోనే హెచ్చరించాం. భూదాన్ భూముల్లో ఎవరికీ పట్టాలు లేవు. తవ్వకాలు నిలిపివేసి నిందితులపై చర్యలు తీసుకుంటాం.–దామోదర్‌రావు, తహసీల్దార్, మేళ్లచెరువు