- పార్టీ మార్పుపై త్వరలో ప్రటిస్తానని వెల్లడి
ఖానాపూర్, వెలుగు: బీజేపీ అధిష్టానం ఖానాపూర్ అసెంబ్లీ టికెట్ ను ఓడిపోయే వ్యక్తిని ఇచ్చిందని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు, పెంబి జడ్పీటీసీ భూక్య జాను బాయ్ అన్నారు. ఖానాపూర్ ప్రెస్ క్లబ్ లో బుధవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. తాను కొన్నేండ్లుగా పార్టీని నమ్ముకుని ఉంటే, తనకు టికెట్ఇవ్వకుండా అధిష్టానం మోసం చేసిందని కన్నీటిపర్యంతమయ్యారు.
డబ్బుల కోసమే అధిష్టానం టికెట్ ను అమ్ముకుందని ధ్వజమెత్తారు. ఎన్నికల్లో తాను ఖానాపూర్ నియోజకవర్గం నుంచి పోటీలో ఉండడం ఖాయమని వెల్లడించారు. త్వరలోనే తన అనుచరులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి భవిష్యత్తు కార్యక్రమం ప్రకటిస్తానని ఈ సందర్భంగా పేర్కొన్నారు. సమావేశంలో నాయకులు గోపాల్ రెడ్డి, రాజేందర్ నాయక్, గంగాధర్, భూమా రెడ్డి, శ్రీను, పవన్, సుధాకర్ ఉన్నారు.