దెబ్బతిన్న పంటలకు పరిహారం చెల్లించాలి

జన్నారం, వెలుగు : అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించాలని బీఆర్ఎస్ ఖానాపూర్ 
నియోజకవర్గ ఇన్​చార్జి భూక్య జాన్సన్ నాయక్ డిమాండ్ చేశారు. మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో ఇటీవల కురిసిన ఆకాల వర్షాలకు దెబ్బతిన్న మొక్కజొన్న పంటలను గురువారం రైతులతో కలిసి  ఆయన పరిశీలించి మాట్లాడారు. అకాల వర్షాలకు గ్రామంలో సుమారు 70 ఎకరాల్లో పంటలకు నష్టం జరిగి, రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు.

మోసపూరిత హమీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు చేసిందేమీ లేదని, రైతు బంధు కింద రూ.15 వేలు ఇస్తామని గొప్పలు చెప్పిన కాంగ్రెస్ నాయకులు కనీసం రూ.10 వేలు కూడా ఇవ్వడం లేదన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు క్షేత్రస్థాయిలో పర్యటించి నష్టపోయిన

రైతులకు ధైర్యం చెప్పి పరిహారం ఇప్పించేలా కృషి చేయాలన్నారు. జడ్పీటీసీ ఎర్ర చంద్రశేఖర్, గ్రామ మాజీ సర్పంచ్ జాడి గంగాధర్, బీఆర్ఎస్ జిల్లా అధికార ప్రతినిధి సిటిమల భరత్ కుమార్, మండల జనరల్ సెక్రెటరీ జనార్దన్, కో అప్షన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.