ఇల్లందు, వెలుగు: డీసీసీ అధ్యక్షుడి నిర్వాకంతో జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతోందని ఇల్లందు నియోజకవర్గ నాయకుడు డా. భుక్యా రాంచంద్రనాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం రాజీవ్ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పక్క జిల్లా నుంచి వచ్చిన పోదెం వీరయ్యను ఎమ్మెల్యేగా జిల్లా ప్రజలు ఆదరించారని, పార్టీ అధినాయకత్వం డీసీసీ అధ్యక్షుడిగా, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడిగా, పొలిటికల్ ఎఫైర్ కమిటీ సభ్యుడిగా నియమించిందని గుర్తు చేశారు. ఏఐసీసీ, టీపీసీసీ పిలుపు ఇచ్చినా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించడం లేదని ఆరోపించారు. జిల్లాలో జెండాలు మోసిన నాయకులు ఎవరో కూడా డీసీసీ అధ్యక్షుడికి తెలియదని అన్నారు. ఇప్పటివరకు జిల్లా, నియోజకవర్గ, మండల సమావేశాలు నిర్వహించలేదని ఆరోపించారు. ఆజాదికా గౌరవ్ యాత్రలో పాదయాత్ర నిర్వహించలేదని అన్నారు. పార్టీ కార్యక్రమాలు నిర్వహించాలని అడిగితే నోటి దురుసుగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ కేంద్రమంత్రిపై దాడి చేయడం ఏమిటని ప్రశ్నించారు. వెంటనే డీసీసీ అధ్యక్షుడిని మార్చాలని కోరారు. గడ్డి శ్రీనివాస్, రుద్ర రామస్వామి పాల్గొన్నారు.
పీహెచ్‌సీల్లో ప్రసవాలకు ప్రాధాన్యత ఇస్తున్నాం
పీహెచ్సీలలో ఎక్కువగా ప్రసవాలు జరిగేలా చర్యలు చేపడుతున్నాం. ఎప్పటికప్పుడు వైద్యులు, వైద్య సిబ్బందికి సూచనలిస్తున్నాం. నేను బాధ్యతలు చేపట్టిన తర్వాత పీహెచ్‌సీల్లో డెలివరీల సంఖ్య కొంత వరకు పెంచాం. తక్కువ డెలివరీలు జరుగుతున్న పీహెచ్‌సీలపై దృష్టి పెడతాం.
- దయానందస్వామి,
డీఎంహెచ్‌వో, భద్రాద్రికొత్తగూడెం
భద్రాద్రిలో కొత్తలపండుగ
భద్రాచలం, వెలుగు: ఆదివాసీలు ఆదివారం కొత్తల పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఒడిశా నుంచి వచ్చిన గోండ్వాన నాయకులతో కలిసి ముందుగా భద్రాచలంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జగదీష్కాలనీ, శ్రీరామనగర్ కాలనీల సమీపంలో ఉన్న దమ్మక్కగూడెంలో కొత్తల పండుగ నిర్వహించారు. గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా గోండ్వాన జాతీయ కార్యవర్గ సభ్యుడు మడివి నెహ్రూ సంస్కృతి, సంప్రదాయాలే ఆదివాసీల ఉనికికి, మనుగడకి ఆధారమని అన్నారు. ఈ డిసెంబరులో ఒడిశాలోని ఝార్సుగూడలో జరిగే 15వ అఖిల భారతీయ గోండ్వాన గోండ్ మహాసభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఒడిశా గోండ్వాన గోండ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు మహేంద్రనాయక్, కార్యదర్శి ప్యారీ మోహన్‌నాయక్, కలహండీ జిల్లా అధ్యక్షుడు పద్మన్ పత్ర్, ఝార్సుగూడ జిల్లా అధ్యక్షుడు డంబరుదర్నాయక్, అంగుల్ జిల్లా అధ్యక్షుడు సదాసిబ నాయక్, బలంగిర్ జిల్లా అధ్యక్షుడు శ్యాంసుందర్ భోయ్ పాల్గొన్నారు.
పోడు భూములకు పట్టాలివ్వాలి
పాల్వంచ,వెలుగు: గిరిజనులు సాగు చేస్తున్న పోడు భూములకు ప్రభుత్వం వెంటనే పట్టాలు ఇవ్వాలని సేవాలాల్ సేన జిల్లా అధ్యక్షుడు హరినాయక్, ఇన్చార్జి హుస్సేన్ నాయక్ డిమాండ్ చేశారు. ఆదివారం మండలంలోని పెద్దమ్మ తల్లి ఆలయం వద్ద జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వక పోవడంతో ఫారెస్ట్ అధికారులు దాడులు చేస్తూ, కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన జనాభా ప్రకారం 10 శాతం రిజర్వేషన్ కల్పించాలని, జీవో నెంబర్ 3ను కొనసాగించాలని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 9న జరిగే సేవాలాల్ సేన ఆవిర్భావ వేడుకలను విజయవంతం చేయాలని కోరారు. అనంతరం కరపత్రాలను రిలీజ్ చేశారు. సురేష్, భరత్, మంగీలాల్, నవీన్, రమేశ్, రాందాస్, భద్రు, నాగరాజు పాల్గొన్నారు.
నేటి నుంచి జిల్లాలో కేంద్రమంత్రి బీఎల్ వర్మ పర్యటన
ఖమ్మం కార్పొరేషన్, వెలుగు: ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి, కో ఆపరేటివ్ శాఖ కేంద్ర మంత్రి బీఎల్ వర్మ నేటి నుంచి రెండు రోజుల పాటు జిల్లాలో పర్యటించనున్నట్లు బీజెపీ జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ తెలిపారు. సోమవారం ఉదయం 7 గంటలకు హైద్రాబాద్ నుంచి నేలకొండపల్లి మండలం పైనంపల్లికి చేరుకుంటారు. అక్కడి నుంచి ముదిగొండ వరకు కేంద్ర ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేస్తున్న నేషనల్ హైవే రోడ్డు పనులను పరిశీలించనున్నారు. అక్కడి నుంచి ఖమ్మం చేరుకుని 2:30కు ఖమ్మం పార్లమెంట్ కోర్ కమిటీ సమావేశంలో పాల్గొంటారు. 3:30 కు ఖమ్మం పార్లమెంటు పరిధిలోని మండల అధ్యక్షులు, ఇతర నాయకులతో హోటల్ శ్రీశ్రీలో సమావేశం కానున్నారు. 6:30కు వైరా నియోజకవర్గంలోని రాజ్యతండాలో గిరిజన పెద్దలతో సమావేశం అవుతారు. రాత్రి ఖమ్మం నగరంలోని ఎన్ఎస్పీ అతిథి గృహంలో బస చేస్తారు. 3న ఉదయం 7:30 గంటలకు లక్ష్మీనరసింహస్వామి, 8:30కు పులిగుట్ట నరసింహస్వామి దర్శనం చేసుకుని, 10:30కు కలెక్టరేట్లో జిల్లా అధికారులతో సమావేశమవుతారు. మధ్యాహ్నం బోనకల్లో అక్కడి నాయకులతో సమావేశం అవుతారు. బోనకల్ నుంచి చిల్లకల్లు హైవే మీదుగా హైదరాబాద్ చేరుకుని అనంతరం ఢిల్లీ వెళ్ళనున్నారు.
ఆశ్రమోన్నత పాఠశాలల్లో సమస్యలు పరిష్కరించాలి
భద్రాచలం,వెలుగు: భద్రాచలం ఐటీడీఏ పరిధిలోని ఆశ్రమోన్నత పాఠశాలల్లో సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్(పీఆర్టీయూ) జిల్లా అధ్యక్షుడు డి.వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి బి.రవి ఆదివారం పీవో గౌతమ్ పోట్రుకు లేఖ రాశారు. జీవో ఎంఎస్ నెంబర్ 56 ప్రకారం కన్వర్టెడ్ ఆశ్రమ స్కూళ్లకు నాలుగు ఎస్జీటీ పోస్టులను సర్దుబాటు చేయాలని, అన్ని జిల్లాల్లో అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ ఏడాది ఎన్రోల్మెంట్ ఎక్కువగా ఉన్న దృష్ట్యా సీఆర్టీలను నియమించాలని కోరారు. నైట్ డ్యూటీ నుంచి గర్భిణులు, గుండె సంబంధిత టీచర్లకు మినహాయింపు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఎనిమిదేళ్లుగా ఒకే చోట పని చేస్తూ కుటుంబాలకు దూరంగా ఉన్న వారికి విద్యార్థులు ఎక్కువగా ఉన్న స్కూల్‌కు డిప్యూటేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్పౌజ్ కేటగిరీ వారికి ఉమ్మడి జిల్లాలో డిప్యూటేషన్ కల్పించాలని కోరారు. పీఎమ్మార్సీలో లాంగ్ స్టాండింగ్ ఉన్న వారి డిప్యూటేషన్ రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు.
ప్రశాంతంగా కానిస్టేబుల్ రాత పరీక్ష
ఖమ్మం కార్పొరేషన్/భద్రాద్రికొత్తగూడెం, వెలుగు:ఖమ్మం జిల్లాలో ఆదివారం నిర్వహించిన కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని 105 పరీక్షా కేంద్రాల్లో 35,954 మంది అభ్యర్ధులకు గాను 3603 మంది అభ్యర్ధులు గైర్హాజరైనట్లు అధికారులు తెలిపారు. నగరంలోని శాంతినగర్ కాలేజ్, గర్ల్స్ హైస్కూల్ సెంటర్లను సీపీవిష్ణు ఎస్ వారియర్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
కొత్తగూడెంలో 1,444 మంది గైర్హాజరు
భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం, పాల్వంచ, భద్రాచలం పట్టణాల్లో 49 పరీక్షా కేంద్రాల్లో ఎగ్జామ్ నిర్వహించారు. 17,077 మందికి గాను 15,633 మంది ఎగ్జామ్ రాశారు. 1,444మంది అభ్యర్థులు గైర్హాజరైనట్లు ఆఫీసర్లు తెలిపారు. కొత్తగూడెంలోని ప్రియదర్శిని డిగ్రీ కాలేజీకి ఇద్దరు పిల్లలతో వచ్చిన మహిళా అభ్యర్థిని ఒక్క నిమిషం నిబంధనతో ఎగ్జామ్‌కు అనుమతించలేదు. సింగరేణి ఉమెన్స్ కాలేజీ సెంటర్లో పది రోజుల పసిబిడ్డతో సాయిలక్ష్మి ఎగ్జామ్‌కు వచ్చారు. పాపను తన తల్లి వద్ద వదిలి వెళ్లగా, మహిళా పోలీసులు బాసటగా నిలిచారు. భద్రాచలంలోని 10 సెంటర్లలో 2849 మంది ఎగ్జామ్ రాయాల్సి ఉండగా 2,473 మంది ఎగ్జామ్‌కు హాజరయ్యారు. గైర్హాజరైన 383 మంది పురుష అభ్యర్థులే కావడం గమనార్హం. పలు ఎగ్జామ్ సెంటర్లను ఎస్పీ వినీత్ సందర్శించారు.
హక్కులను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వం
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
ఖమ్మం టౌన్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం హక్కులను కాల రాస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. మంచికంటి భవన్ లో ఆదివారం సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు ఎర్రా శ్రీకాంత్ అధ్యక్షతన జిల్లా ప్లీనరీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని మోడీ వివిధ రాష్ట్రాల్లో ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చే పనిలో నిమగ్నమయ్యారని విమర్శించారు. ఓట్లు వేసి గెలిపించిన ప్రజల తీర్పుకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చడం సరైంది కాదన్నారు. అదానీ, అంబానీ వంటి కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించి కార్మికుల ఉపాధిని దెబ్బతీస్తోందన్నారు. పరిశ్రమలు, ప్రభుత్వ రంగసంస్థలు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి పోతే సంపదంతా వారి వద్దే కేంద్రీకృతమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు బి.వెంకట్, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్, ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, రాష్ట్ర కమిటీ సభ్యుడు పొన్నం వెంకటేశ్వర్లు, మాచర్ల భారతి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్యాణం వెంకటేశ్వరరావు, బండి రమేశ్, బుగ్గవీటి సరళ, భుక్యా వీరభద్రం, బొంతు రాంబాబు, వై విక్రమ్ పాల్గొన్నారు.
గురుకులాల్లో సమస్యలు పరిష్కరించాలి
కారేపల్లి,వెలుగు: గురుకులాల్లో సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు ఆజాద్ డిమాండ్ చేశారు. మండలంలోని గాంధీనగరం గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలను పీడీఎస్‌యూ, పీవైఎల్ నాయకులు ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆజాద్ మాట్లాడుతూ గాంధీనగరం గురుకులంలో డార్మెటరీలు లేక స్టూడెంట్స్ క్లాస్రూముల్లోనే నిద్రిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం పిల్లల కడుపులు కొట్టి కాంట్రాక్టర్ల జేబులు నింపుతోందని ఆరోపించారు. అధికారుల పర్యవేక్షణ లేక విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందడం లేదని ఆరోపించారు. పీవైఎల్ జిల్లా కార్యదర్శి రాకేశ్, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.