శుద్ధి చేయాల్సింది ఆలయాన్ని కాదు.. చంద్రబాబు నాలుకను.. భూమన

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతి లడ్డూ కల్తీ వివాదంపై టీటీడీ బోర్డు మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ స్పందించారు. ఇవాళ (సెప్టెంబర్ 23)  తిరుమల వెళ్లిన భూమన.. వేంకటేశ్వరస్వామి పుష్కరణిలో స్నానం చేసి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు చెప్పినట్లుగా  టీటీడీ ఈవో వ్యవహరిస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శుద్ధి చేయాల్సింది తిరుమల దేవాలయాన్ని కాదని.. పచ్చి అబద్ధాలు ఆడుతోన్న చంద్రబాబు నాలుకని శుద్ధి చేయాలని విమర్శించారు.

 ‘‘అత్యంత శక్తిగల తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి వారిపై రాజకీయం చేసి చంద్రబాబు చాలా పెద్ద తప్పు చేశారు. నేను గానీ, వైవీ సుబ్బారెడ్డి గానీ తప్పు చేసి ఉంటే సర్శనాశనమై పోవాలి. ఆ స్వామివారి కటాక్షంతో మూడు సార్లు టీటీడీ పాలకమండలి సభ్యుడిగా రెండు సార్లు చైర్మన్‎గా స్వామివారు నాకు అవకాశం ఇచ్చారు. ఆ దేవదేవుడి కృప నాపై ఉంది. మీరు అంటున్నట్టు నేను క్రిస్టియన్‎నో, నాస్తికుడినో కాదు. 

ALSO READ | లడ్డూ ప్రసాదంలో తప్పు చేసి ఉంటే.. నేను నా కుటుంబం సర్వ నాశనం:తిరుమల అఖిలాండం దగ్గర భూమన ప్రమాణం

మీ ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేస్తే అంగీకరించడానికి సిద్ధంగా లేము. మేం తప్పు చేయలేదు, చేయము కూడా’’ అని అన్నారు. తిరుపతి లడ్డూ కల్తీపై సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని మేం డిమాండ్ చేస్తున్నామన్నారు. మీ కనుసన్నల్లో ఉండే సిట్‎తో కాదని.. కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించండన్నారు. రాజకీయ లబ్ధి కోసం ప్రత్యర్థుల ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడని చరిత్ర మీదని ఘాటు విమర్శలు చేశారు.